Peddapalli: సుల్తానాబాద్‌ CHCలో మెరుగైన వైద్య సేవలు అందించాలి కలెక్టర్

Peddapalli: హెల్త్ సెంటర్‌లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, నిర్వహణపై శ్రద్ధ వహించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.

KONDAL, SULTANABAD
Published on: 11 Aug 2026 8:33 PM IST
Peddapalli
X

Peddapalli: సుల్తానాబాద్‌ CHCలో మెరుగైన వైద్య సేవలు అందించాలి కలెక్టర్

పెద్దపల్లి: సుల్తానాబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా ఆసుపత్రి నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.

మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్వహణ, వైద్య సేవలు, సిబ్బంది విధుల నిర్వహణ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ వైద్యులు, ఇతర సిబ్బంది సమయపాలనపై జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా ఆరా తీశారు. ప్రతి వైద్యుడు, సిబ్బంది నిర్ణీత సమయానికి విధులకు హాజరై, తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.

డెంటల్ విభాగంలో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని, నూతన విధానాలను ప్రారంభించి, ప్రజలకు మెరుగైన దంత వైద్య సేవలు అందేలా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఆసుపత్రి పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఆసుపత్రి భవనం, వైద్య విభాగాలు, పరిసర ప్రాంతాలను నిరంతరం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రోగులు, వారి సహాయకులకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం అందేలా ఆసుపత్రి ప్రాంగణాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.

ఆసుపత్రి షాపింగ్ కాంప్లెక్స్ నిర్వహణపై కూడా జిల్లా కలెక్టర్ సమీక్షించారు. షాపింగ్ కాంప్లెక్స్‌లోని దుకాణాల అద్దెను పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, ఇందుకు సంబంధించిన నోటీసులను వారం రోజుల్లోగా జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. పెంచిన అద్దె మొత్తాన్ని వ్యాపారులు చెల్లించని పక్షంలో నిబంధనల ప్రకారం టర్మినేషన్ నోటీసులు జారీ చేసి తదుపరి చర్యలు చేపట్టాలని సూచించారు.

కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అవసరమైన సౌకర్యాలు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి సకాలంలో వైద్య సేవలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమాదేవి,వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

KONDAL, SULTANABAD

KONDAL, SULTANABAD

Next Story