Sircilla: భూముల రీ సర్వేను ఎలాంటి తప్పులు లేకుండా పూర్తి చేయాలి: కలెక్టర్!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూముల రీ సర్వేను పక్కాగా పూర్తి చేయాలని, రైతులకు 4 రోజుల ముందే సమాచారం ఇవ్వాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
Sircilla: భూముల రీ సర్వేను ఎలాంటి తప్పులు లేకుండా పూర్తి చేయాలి: కలెక్టర్!
రాజన్న సిరిసిల్ల జిల్లా: జిల్లాలో భూముల రీ సర్వే ప్రక్రియను ఎలాంటి తప్పులు లేకుండా కచ్చితత్వంతో, పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు.
భూముల రీ సర్వే ప్రక్రియ పురోగతిపై గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి అన్ని మండలాల తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులతో కలిసి నిర్వహించిన ఈ సమావేశంలో మండలాల వారీగా ఇప్పటివరకు రీ సర్వే చేపట్టిన గ్రామాలు, పనుల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. గ్రామాల హద్దులు, ప్రభుత్వ భూములు, అటవీ శాఖ భూములు, నీటి వనరుల సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాల సరిహద్దుల సర్వేను సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, రెవెన్యూ, అటవీ శాఖతో పాటు సంబంధిత ప్రభుత్వ శాఖలు సమన్వయంతో సంయుక్తంగా చేపట్టాలని సూచించారు. ప్రతి గ్రామంలో భూముల రీ సర్వే చేపట్టే విషయాన్ని రైతులకు నాలుగు రోజుల ముందుగానే గ్రామ పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, వ్యవసాయ శాఖ అధికారులు తెలియజేయాలని ఆదేశించారు. అలాగే రెండు రోజుల ముందుగా జెండాలు కూడా అందించాలని స్పష్టం చేశారు.
రైతుల సమక్షంలోనే వారి భూముల రీ సర్వే నిర్వహించి, సేకరించిన వివరాలను వారికి తెలియజేయడంతో పాటు వారి సంతకాలు తీసుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్, ఆర్డీవోలు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ జిల్లా అధికారి, డీఐలు, తహసీల్దార్లు రీ సర్వే జరుగుతున్న గ్రామాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో ప్రక్రియను పరిశీలించాలని ఆదేశించారు.
భూముల రీ సర్వే వల్ల కలిగే ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించాలని, భూములకు సంబంధించిన సమాచారాన్ని ఎలాంటి తప్పులకు తావులేకుండా పకడ్బందీగా సేకరించాలని తెలిపారు. రోజువారీ లక్ష్యాలతో పనులు చేపట్టి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఆర్డీవోలు శ్రీధర్ బాబు, కే.ఎస్.బీ. కుమారి, ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాస్, డీఐలు, తదితరులు పాల్గొన్నారు.




