Siricilla: కాంగ్రెస్ ప్రజా పాలనకు వెయ్యి రోజులు.. సిరిసిల్లలో విజయోత్సవ ర్యాలీ

Siricilla: రాజన్న సిరిసిల్లలో కాంగ్రెస్ ప్రజా పాలన వెయ్యి రోజుల విజయోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

KALEEM, SIRICILLA
Published on: 4 Sept 2026 5:20 PM IST
Siricilla
X

Siricilla: కాంగ్రెస్ ప్రజా పాలనకు వెయ్యి రోజులు.. సిరిసిల్లలో విజయోత్సవ ర్యాలీ

Rajanna Siricilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా పాలన వెయ్యి రోజుల విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నేతన్న చౌక్ నుంచి అంబేద్కర్ చౌక్ మీదుగా గాంధీ చౌక్ వరకు కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీ చేపట్టారు.

ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ నేతన్న విగ్రహంతో పాటు మహాత్మా జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గాంధీ చౌక్ వద్ద పటాకులు పేల్చి, కేక్ కట్ చేసి విజయోత్సవాలు నిర్వహించారు.

హామీల అమలుతో ప్రజా పాలన: సంగీతం శ్రీనివాస్

ఈ సందర్భంగా సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా పాలన సంక్షేమం, అభివృద్ధి దిశగా కొనసాగుతోందన్నారు. పేదలు, బడుగు, బలహీన వర్గాలు, కార్మికులు, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.

మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, పంటల కొనుగోలు, ధాన్యం విక్రయించిన వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జమ వంటి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు.

అర్హులైన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు జారీ చేయడంతో పాటు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, మహిళా సంఘాలకు రుణాలు, పావలా వడ్డీ వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు.

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ప్రాధాన్యం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ ధార్మిక క్షేత్ర అభివృద్ధితో పాటు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సంగీతం శ్రీనివాస్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న బకాయిలను చెల్లించి కార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. నిరుద్యోగ భృతి, ప్రతి ఇంటికి ఉద్యోగం, దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాల భూమి వంటి హామీలు అమలుకు నోచుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం డీఎస్సీ నిర్వహించి ఉద్యోగాలు కల్పించిందన్నారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు మద్దతు

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిపాదనకు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మొదటగా మద్దతు తెలిపారని పేర్కొన్నారు. మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్ సహకారంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అభివృద్ధి కొనసాగుతోందన్నారు.

బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, రానున్న కాలంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని సంగీతం శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రజా పాలనను ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుర దేవరాజు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆడెపు చంద్రకళ, కౌన్సిలర్లు, వివిధ మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story