Manthani: ఎంపీ గడ్డం వంశీ కృష్ణపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి!

Manthani: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు ఫిర్యాదు చేశారు.

SHANKAR, MANTHANI
Published on: 12 Nov 2026 10:56 AM IST
Manthani
X

Manthani: ఎంపీ గడ్డం వంశీ కృష్ణపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి!

Manthani: పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు గడ్డం వంశీ కృష్ణపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి సెగ్గం రాజేష్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ వంశీ కృష్ణ వ్యవహారశైలి పై పలు ఆరోపణలు చేశారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న మంథని నియోజకవర్గంలో ఎంపీ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పర్యటిస్తున్నారని, కనీస ప్రోటోకాల్‌ను కూడా పాటించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. మంత్రి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు, మండల అధ్యక్షులకు సమాచారం ఇవ్వకుండానే పర్యటనలు చేపడుతున్నారని ఆరోపించారు.

పరామర్శల పేరుతో బీఆర్ఎస్ నాయకులతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నారని, దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంటోందని తెలిపారు. ఎంపీ వ్యవహారశైలి కారణంగా నియోజకవర్గ ప్రజల్లోనూ పార్టీ పట్ల అపోహలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు.

కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మంత్రి శ్రీధర్ బాబు ఎంతో కృషి చేశారని, ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో పార్టీ విజయానికి కీలక పాత్ర పోషించారని ఫిర్యాదులో ప్రస్తావించారు. అలాంటి సీనియర్ నాయకుడి పట్ల ఎంపీ వ్యవహరిస్తున్న తీరు, ఇటీవల విడుదల చేసిన లేఖలు, చేసిన వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల్లో అసంతృప్తికి కారణమవుతున్నాయని ఆరోపించారు.

అలాగే నియోజకవర్గంలో పార్టీ నాయకులతో సమన్వయం లేకుండా వ్యవహరించడం, అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర విషయాల్లో పరస్పర సహకారం పాటించకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో ఎంపీ గడ్డం వంశీ కృష్ణ వ్యవహారశైలిపై సమగ్ర విచారణ జరిపి, పార్టీకి నష్టం కలిగించే చర్యలకు పాల్పడుతున్నట్లు తేలితే తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడిని కాంగ్రెస్ నాయకులు తమ ఫిర్యాదులో కోరారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI