Thimmapur: ఎమ్మెల్యే పేరు చెప్పి అక్రమ వసూళ్లు: కాంగ్రెస్ కార్యకర్త ఆరోపణ
Thimmapur: మానకొండూర్ ఎమ్మెల్యే పేరు చెప్పి తిమ్మాపూర్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్, సర్పంచ్ రవి రూ.2 లక్షలు వసూలు చేశారని కార్యకర్త గొల్లెన తిరుపతి ఆధారాలతో ఆరోపించారు.
Thimmapur: ఎమ్మెల్యే పేరు చెప్పి అక్రమ వసూళ్లు: కాంగ్రెస్ కార్యకర్త ఆరోపణ
కరీంనగర్ జిల్లా: తిమ్మాపూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో శంకరపట్నం మండలం అంబాల్ పూర్ గ్రామానికి చెందిన గొల్లెన తిరుపతి మీడియా సమావేశం నిర్వహించి అక్రమ వసూళ్ల ఆధారాలను చూపించి న్యాయం చేయాలని ఎమ్మెల్యేని కోరారు.
ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వికలాంగుడైన గొల్లెన తిరుపతి మైనింగ్ అధికారుల నుండి తిమ్మాపూర్ మండలం పోలంపల్లి పరిధిలోని సర్వే నంబర్ 69లో మట్టి తరలింపునకు డిసెంబర్ 5 తేదీ వరకు అనుమతి తీసుకున్నారు.
ఆ తరువాత మట్టిని తరలిస్తుండగా తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి రమేష్, నర్సింగాపూర్ సర్పంచ్ రవి తనను ఎమ్మెల్యే పేరు చెప్పి నాలుగు లక్షలు డిమాండ్ చేయగా రెండు లక్షలు ముట్టజెప్పినట్లు, అందులో ఫోన్ పే ద్వారా ఇరువురికి రూ.48వేలు ఇచ్చినట్లు ఆధారాలు చూపి, మిగతా డబ్బులు నగదు రూపంలో అందజేసినట్లు తెలిపారు.
మిగతా రెండు లక్షల కోసం ఒత్తిడి తీసుకొచ్చారని, గడువు అడిగితే ఇవ్వకుండా అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి తనకున్న అనుమతిని రద్దు చేయించారని, తన మట్టి వాహనాలను పోలీసులకు సమాచారం అందించి పట్టించారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనైన తనను తీవ్ర మనోవేదనకు గురి చేసినారని, ఎమ్మెల్యే దృష్టికి తీసుకొస్తున్నట్లు తిరుపతి తెలిపారు.
తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన రమేష్, రవిపై ఎమ్మెల్యే చర్యలు తీసుకోవాలని తిరుపతి కోరారు. తన పర్మిట్ ను రద్దు చేయించి, పలువురి వద్ద అక్రమంగా డబ్బులు వసూలు చేసి అక్రమంగా మట్టి తరలింపును రమేష్ ప్రోత్రహిస్తున్నారని తిరుపతి ఆరోపించారు.




