Ramagundam: రామగుండంలో శాంతి కమిటీ సమావేశం: సీపీ అంబర్ కిషోర్ ఝా!
Ramagundam: రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ముస్లిం మత పెద్దలతో సీపీ అంబర్ కిషోర్ ఝా పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు.
Ramagundam: రామగుండంలో శాంతి కమిటీ సమావేశం: సీపీ అంబర్ కిషోర్ ఝా!
రామగుండం: మీలాద్-ఉన్-నబీ (ఈద్-ఎ-మిలాద్) పండుగను పురస్కరించుకుని రామగుండం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధ్యక్షతన కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన ముస్లిం మత పెద్దలతో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పండుగను శాంతియుతంగా, సోదరభావంతో నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ సభ్యులు,మత పెద్దలతో సీపీ చర్చించారు.పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు.
జూలూసులు, ర్యాలీలు నిర్వహించే సందర్భంలో ముందస్తు అనుమతులు తీసుకుని, నిర్ణయించిన మార్గాల్లో మాత్రమే కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ర్యాలీలు,జూలూసుల సమయంలో ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా నిర్వాహకులు స్వచ్ఛంద సేవకులను నియమించుకోవాలని తెలిపారు.
అధిక శబ్దం కలిగించే సౌండ్ సిస్టమ్‌లు, డీజేలు,ఇతర పరికరాలను నిబంధనలకు విరుద్ధంగా ఉపయోగించకూడదని సూచించారు. చిన్నారులు,వృద్ధులు, విద్యార్థులు, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు ఇబ్బంది కలగకుండా చూడాలని తెలిపారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీసే ప్రసంగాలు, పాటలు,నినాదాలకు దూరంగా ఉండాలని, ఇతర మతాలు, వర్గాల మనోభావాలను గౌరవించాలని కోరారు.
యువత ముఖ్యంగా శాంతి,క్రమశిక్షణతో వ్యవహరించి ఎలాంటి గొడవలు,వివాదాలకు దూరంగా ఉండాలని సూచించారు.పండుగ కార్యక్రమాల సమయంలో మహిళలు,చిన్నారుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.ర్యాలీల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ పోలీసు అధికారులకు పూర్తి సహకారం అందించాలని కోరారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, మతపరమైన కార్యక్రమాలు నిర్వహించే సమయంలో ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ఇతరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు.
పండుగ సందర్భంగా పోలీసుల ఆధ్వర్యంలో అవసరమైన భద్రతా ఏర్పాట్లు,ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడతామని తెలిపారు.కొంతమంది సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు,పుకార్లు సృష్టించే అవకాశం ఉందని,ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా పోస్టులు చేసే అవకాశం ఉన్నందున ప్రజలు అటువంటి పోస్టులను చూసి సంయమనం పాటించాలని కోరారు. ఏదైనా సమాచారం నిజమా,కాదా అనే విషయాన్ని స్థానిక పోలీసులను సంప్రదించి తెలుసుకోవాలని సూచించారు.
ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే డయల్ 112, కమిషనరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 8712656597 లేదా స్థానిక పోలీసులను సంప్రదించాలని తెలిపారు.సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసి,మత ఘర్షణలు జరిగేలా లేదా శాంతిభద్రతల సమస్యలకు కారణమయ్యే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అన్ని మతాలకు సంబంధించిన సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, నిరంతరం నిఘా ఉంచాలని,ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పండుగలను ప్రజలు సంతోషంగా జరుపుకునేలా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సీపీ అధికారులను ఆదేశించారు. శాంతి,సౌభ్రాతృత్వం, పరస్పర గౌరవంతో మీలాద్-ఉన్-నబీ పండుగను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కోరారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (పరిపాలన) కె.శ్రీనివాస్,స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్,మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాష్, పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్,రామగుండం సీఐ కృష్ణ కుమార్, బెల్లంపల్లి వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు,స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ భీమేష్,ఆర్‌ఐ రమేష్, పెద్దపల్లి ఎస్‌ఐ నరేష్ కుమార్,స్పెషల్ బ్రాంచ్ ఎస్‌ఐ చంద్రశేఖర్,చెన్నూర్ టౌన్ ఎస్‌ఐ శ్యామ్ పటేల్,మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.




