Karimnagar: మోడీ పాలనలో నిరుద్యోగం, ధరల భారం తీవ్రమైంది: సిపిఐ!
Karimnagar: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆగస్టు 6 నుండి 14 వరకు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సిపిఐ ప్రచార యాత్ర నిర్వహించనుంది.
Karimnagar: మోడీ పాలనలో నిరుద్యోగం, ధరల భారం తీవ్రమైంది: సిపిఐ!
కరీంనగర్: కేంద్రంలో అధికారం చలాయిస్తున్న బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే సిపిఐ ఆధ్వర్యంలో ప్రచార యాత్ర నిర్వహిస్తున్నామని జిల్లా వ్యాప్తంగా ఈనెల 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు ప్రచార యాత్ర కొనసాగుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ తెలిపారు.
కరీంనగర్ లోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుల మండల కార్యదర్శుల సంయుక్త సమావేశం బండ రాజిరెడ్డి అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో ఉన్న దశాబ్ద కాలంగా దేశవ్యాప్తంగా తీవ్రమైన ఆందోళనలు నిరాశ నిస్పృహలు పెరిగిపోయి ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని, ఎన్నికల సందర్భంగా దేశ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలం చెందారని, బీజేపీ ప్రభుత్వ వైఫల్యంలో అతి పెద్దది నిరుద్యోగమని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలం చెందారన్నారు. సామాన్య పేద మధ్య తరగతి కుటుంబాల జీవన ప్రమాణాలను దెబ్బతీసే విధంగా నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోలు,డీజిల్, వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెంచిందని, ధరల పెరుగుదలను నియంత్రించలేని మోడీ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు. దేశానికి వెన్నెముక లాంటి అన్నదాతలను ఆదుకోవడం లేదని, వారు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కి చట్టపరమైన హామీ ఇవ్వాలని డిమాండ్ ఇంకా పరిష్కారం కాలేదన్నారు. విద్య,వైద్యం కార్పొరేట్ శక్తుల్లో మగ్గుతుందని, కార్మికులు చెమటోడ్చి సంపాదించిన దేశ సంపదను పెట్టుబడిదారులకు కట్టబెడుతోందని, మహిళా సాధికారత గురించి పదేపదే మాట్లాడే బిజెపి నేతలు వారి రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయడం లేదని శ్రీనివాస్ ప్రశ్నించారు.
కేంద్రంలో బిజెపి ప్రభుత్వ పాలనను నిరసిస్తూ బద్లావ్ జరూరీ హై - మార్పు కావాలని సిపిఐ జాతీయ సమితి పిలుపుమేరకు ఆగస్టు 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు జిల్లాలో ప్రచార యాత్ర నిర్వహిస్తున్నామని దానిని జయప్రదం చేయాలని సిపిఐ శ్రేణులకు శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
ఈ సమావేశములో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, అందె స్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్, గూడెం లక్ష్మి, కసిరెడ్డి సురేందర్ రెడ్డి,నాగెల్లి లక్ష్మారెడ్డి, బోయిని తిరుపతి,పిట్టల సమ్మయ్య మండల కార్యదర్శులు బండ రాజిరెడ్డి,గోవిందుల రవి, చొక్కల్ల శ్రీశైలం,లంకదాసరి కల్యాణ్,ఎస్. కే .మౌలానా తదితరులు పాల్గొన్నారు.




