Karimnagar: సాయుధ పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి: సిపిఐ డిమాండ్!

Karimnagar: తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని సిపిఐ డిమాండ్. కరీంనగర్‌లో సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం, బద్దం ఎల్లారెడ్డి విగ్రహానికి ఘన నివాళి.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 11 Sept 2026 8:02 PM IST
Karimnagar
X

Karimnagar: సాయుధ పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి: సిపిఐ డిమాండ్!

కరీంనగర్: హైదరాబాద్ సంస్థానంలోని నిజాం రజాకార్ పరిపాలనకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం కీర్తించిందని, ఆనాటి పాలకుల విస్మరణను పదేపదే విమర్శించిన నేటి కాంగ్రెస్ పాలకులు సైతం సాయుధ పోరాటాన్ని విస్మరించడం దుర్మార్గమని,చరిత్రను వక్రీకరిస్తే సిపిఐ చూస్తూ ఊరుకోదని,వక్రీకరించాలనుకునే వారిపై పోరాటాలు నిర్వహిస్తామని రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్ హెచ్చరించారు.

తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల ప్రారంభం సందర్భంగా కరీంనగర్ కోతి రాంపూర్ బైపాస్ రోడ్డులో గల సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన బద్దం ఎల్లారెడ్డి విగ్రహానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్, సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి,అందె స్వామి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు.

వారోత్సవాల కార్యక్రమం ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలవేన శంకర్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం 1947 ఆగస్టు 15న వచ్చినప్పటికీ నిజాం నవాబుల పరిపాలనలో కొనసాగుతున్న హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్ర్యం సిద్ధించలేదని, ఈ సంస్థానంలో ప్రజలను పట్టిపీడిస్తూ వెట్టి చాకిరి చేపిస్తూ,ప్రజల నుండి పన్నులు వసూలు చేస్తూ,బానిసలుగా చూస్తున్న క్రమంలో బానిసత్వానికి వ్యతిరేకంగా భూమి కోసం,భుక్తి కోసం,వెట్టి చాకిరి విముక్తి కోసం,పని ముట్లనే ఆయుధాలుగా మార్చుకొని తెలంగాణ సాయుధ పోరాటం జరిగిందని, సిపిఐ,ఆంధ్రమహాసభ నాయకుల వల్ల,సాయుధ పోరాటంలో ఉద్యమించిన వారి వల్ల హైదారాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనం అయిందని శంకర్ గుర్తుచేశారు.

భారత దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ తెలంగాణ సాయుధ పోరాటాన్ని నేటి, విద్యార్థులకు,యువతరమునకు తెలియజేయడం కోసం పాఠ్యపుస్తకాల్లో ఆ పోరాట చరిత్రను చేర్చాలని సిపిఐ ఎప్పటి నుండే డిమాండ్ చేస్తుందన్నారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సాగిన ఉద్యమంలో అనేక బహిరంగ సభల్లో బి.ఆర్.ఎస్ నాయకులు సాయుధ పోరాటాన్ని కీర్తించారని,కాంగ్రెస్ నాయకులు కూడా సాయుధ పోరాట వారోత్సవాలను అధికారికంగా జరపాలని చిలక పలుకులు పలికారని,రెండు పార్టీలు రాజ్యాధికారం కోసం బద్దం ఎల్లారెడ్డి , రావి నారాయణ రెడ్డి, ముక్దుo మొహియుద్దీన్ ల పేర్లను వాడుకున్నారని తీరా గద్దెనెక్కిన తర్వాత మర్చిపోయారన్నారు.

చరిత్రను కనుమరుగు చేయాలనే ప్రయత్నం చేసే ఏ పాలకులపైన అయినా ఉద్యమాలకు సిపిఐ సిద్ధంగా ఉందని, రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన సాయుధ పోరాట వారోత్సవాలు సెప్టెంబర్ 17వ తేదీ వరకు జరుగుతాయని ముగింపు బహిరంగ సభ హైదరాబాద్ లో నిర్వహిస్తున్నామని జిల్లా నుండి పెద్ద ఎత్తున తరలి రావాలని శంకర్ పిలుపునిచ్చారు.

సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట ఘట్టానికి పిలుపునిచ్చిన అగ్రనేత బద్దం ఎల్లారెడ్డి జన్మించిన గడ్డ ఇది అని, పోరాటాలకు వెనకాడని నేలయిదని ఇలాంటి నేలపై సాగిన తెలంగాణ సాయుధ పోరాటం ఉద్యమం ఒక ప్రాంతీయ ఉద్యమం కాదని, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల ప్రజలను పట్టిపీడిస్తున్న నిజాం రజాకార్ల నుండి వెట్టి చాకిరి విముక్తి కోసం సాగిన ఉద్యమమని, నిజాం నిరంకుశ పాలనను తరిమికొట్టడానికి సాగిన ఆ మహత్తర పోరాటంలో 4500 మంది కమ్యూనిస్టుల ప్రాణ త్యాగం ఉందన్నారు.సాయుధ పోరాటంలో అసువులు బాసిన అమరవీరులను స్మరించుకోవడానికి వారం రోజులపాటు జిల్లా వ్యాప్తంగా అమరవీరులకు నివాళులర్పించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని శ్రీనివాస్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్,బోయిని అశోక్,కసిరెడ్డి సురేందర్ రెడ్డి,నాగెల్లి లక్ష్మారెడ్డి,పిట్టల సమ్మయ్య,న్యాలపట్ల రాజు,జిల్లా కౌన్సిల్ సభ్యులు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్,పైడిపల్లి రాజు,చాడ శ్రీధర్ రెడ్డి,కసిరెడ్డి మణికంఠ రెడ్డి,భావండ్లపెల్లి యుగేందర్,మచ్చ రమేష్,నలువాల సదానందం,నాయకులు సాయవేణి రాయమల్లు,బాకం ఆంజనేయులు,కసిబోజుల సంతోష్ చారి,చెంచల మురళి,కాల్వ శ్రీనివాస్ యాదవ్,నునావత్ శ్రీనివాస్, మామిడిపల్లి హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN