Sircilla: యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలి: సీపీఐ నేత చాడ డిమాండ్!

Sircilla: రైతాంగ జీవనాడి నర్మాల ప్రాజెక్టును కాపాడేందుకు ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించి పూడిక తీయాలని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.

KALEEM, SIRICILLA
Published on: 14 Aug 2026 11:24 PM IST
Sircilla
X

Sircilla: యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలి: సీపీఐ నేత చాడ డిమాండ్!

రాజన్న సిరిసిల్ల జిల్లా: ముస్తాబాద్, గంభీరావుపేట మండలాల రైతులకు జీవనాడిగా ఉన్న నర్మాల ప్రాజెక్టును ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని సీపీఐ నాయకుడు చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. 1946–1951 మధ్య నిర్మాణం పూర్తైన నర్మాల ప్రాజెక్టు దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరుతో పూడికతీత పనులు చేపట్టామని చెప్పినా.. ప్రాజెక్టులో భారీగా పూడిక పేరుకుపోయిందని విమర్శించారు.

2.2 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు ప్రస్తుతం పూడిక కారణంగా సుమారు 1.2 టీఎంసీలకే పరిమితమైందని చాడ వెంకటరెడ్డి తెలిపారు. గతంలో 22 నుంచి 23 వేల ఎకరాలకు సాగునీరు అందించిన నర్మాల ప్రాజెక్టు.. ప్రస్తుతం రైతుల అవసరాలను పూర్తిస్థాయిలో తీర్చలేకపోతోందన్నారు. ప్రాజెక్టులో పేరుకుపోయిన పూడికను పూర్తిగా తొలగించడంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరమ్మతులు చేపట్టాలని ఆయన కోరారు. గేట్లు లేకపోవడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం మరింత తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

నర్మాల ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చేయవచ్చని.. ఇందుకోసం ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించి సమగ్ర అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు 9వ ప్యాకేజీ పనులను పూర్తి చేసి.. ఎల్లంపల్లి, మిడ్ మానేరు, కొండపోచమ్మ వంటి ప్రాజెక్టులతో అనుసంధానం చేయడం ద్వారా నర్మాల ప్రాజెక్టుకు శాశ్వతంగా నీటి సరఫరా కల్పించాలని డిమాండ్ చేశారు. గోదావరి జలాలను నర్మాల ప్రాజెక్టుకు అనుసంధానం చేయడమే శాశ్వత పరిష్కారమని పేర్కొన్నారు.

ఈ సమస్యపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సంబంధిత అధికారులను కలిసి వినతిపత్రం అందజేస్తామని చాడ వెంకటరెడ్డి తెలిపారు. అవసరమైతే ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రిని కలిసి సమస్యను వివరిస్తామని చెప్పారు. నర్మాల ప్రాజెక్టును కాపాడేందుకు సీపీఐ కంకణం కట్టుకుందని.. ప్రాణం ఉన్నంత వరకు ఈ సమస్యపై పోరాటం కొనసాగిస్తామని చాడ వెంకటరెడ్డి స్పష్టం చేశారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story