Karimnagar: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని సీపీఎం ధర్నా
Karimnagar: ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో రైతుల దోపిడీని అరికట్టాలని సీపీఎం డిమాండ్ చేసింది.
Karimnagar
కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంస్థల ద్వారా మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ కొనుగోళ్ళు వేగవంతం చేయకపోవడం మూలంగా అన్నదాతలు అరి గోస పడుతున్నారని, కొనుగోలు వేగవంతం చేయాలని, కొనుగోలు సెంటర్లలో దోపిడీని అరికట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారు.
ధర్నాను ఉద్దేశించి జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు అధికారులు, అట్టహాసంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ కొనుగోళ్ళు వేగవంతం చేయకపోవడం మూలంగా నెల రోజులుగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రైతాంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. తేమ,తాలు పేరుతో క్వింటాల్కు అదనంగా 5 నుండి 8 కిలోలు కోత విధిస్తున్నారన్నారు.
ఏ వన్ గ్రేట్ ధాన్యాన్ని కామన్ గ్రేడ్ గా సెంటర్ నిర్వాహకులు రైస్ మిల్లులకు పంపుతున్నారని, దీంతో రైతులు క్వింటాలకు 20 రూపాయలు నష్టపోతున్నారన్నారు.
సెంటర్ నిర్వాహకులు, రైస్ మిల్లర్లు, కొందరు కిందిస్థాయి అధికారులు కుమ్మక్కై రైతును నిలువు దోపిడీ చేస్తున్నారన్నారు.అక్రమాలకు పాల్పడుతున్న
రైస్ మిల్లులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు అయిన మంచినీరు, టెంట్, టార్పాలిన్లు, మహిళలకు వాష్ రూమ్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
సమయానికి దిగుమతి కాకపోవడంతో రైస్ మిల్లుల దగ్గర ఎండలో బార్లు తీరిన ట్రాక్టర్లు నిలిచి ఉంటున్నాయని, దిగుమతులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మొక్కజొన్న కొనుగోలు సెంటర్లలో రెవెన్యూ,పోలీస్ అధికారులు పర్యవేక్షించాలన్నారు. ప్రాధాన్యత క్రమంలో సెంటర్ నిర్వాహకులు కొనుగోళ్ళు జరపకుండా రాజకీయ ఒత్తిళ్లకు తలోగ్గి వారు సూచించిన రైతులేవే పంట కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు.
లారీల కొరత సాకుతో సెంటర్ నిర్వాహకులు, లారీ యజమానులు క్వింటాల్కు రైతుల దగ్గర 15 రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నారని, వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
మొక్కజొన్న కొనుగోలు సెంటర్లలో గన్ని సంచులు కొరత తీవ్రంగా ఉందని సెంటర్ నిర్వాహకులు రైతులనే గన్నీ సంచులు తెచ్చుకోవాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. రైతుల దిగుబడులకు సరిపడా గన్ని సంచులు అందించాలన్నారు. అకాల వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నప్పటికీ కొనుగోళ్ళు వేగవంతం కాకపోవడం మూలంగా రైతులు ఆందోళనలో ఉన్నారన్నారు. క్వింటాల్కు రూపాయలు 500 బోనస్ డబ్బులు వెంటనే రైతులు అకౌంట్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులు యాసంగి ప్రారంభానికి ముందు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ యాసంగి పంట చేతికి వచ్చినప్పటికీ కూడా రైతు భరోసా నిధులు కేవలం ఎకరానికి మాత్రమే జమ చేశారని వెంటనే రైతులందరికీ రైతు భరోసా నిధులు జమ చేయాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కౌలుభరోసా ఎకరానికి 15 వేల రూపాయలు జమ చేయాలన్నారు. జిల్లాలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో చేతికొచ్చిన మొక్కజొన్న పంటలు దగ్ధం అయ్యాయని, నష్టపోయిన రైతులకు క్వింటాల్కు 70 వేల నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం బియ్యాన్ని సేకరించకపోవడం మూలంగా మిల్లులో నిల్వలు పేరుకుపోయాయని, కేంద్ర ప్రభుత్వం వెంటనే బియ్యం సేకరించాలని డిమాండ్ చేశారు.
ఈ ధర్నా కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గిట్ల ముకుంద రెడ్డి, వర్ణ వెంకటరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఉప్పునుటి శ్రీనివాస్, సుంకర సంపత్, ఎడ్ల రమేష్, జి రాజేశం, డి నరేష్ పటేల్, జిల్లా నాయకులు శాతరాజు భద్రయ్య, గజ్జల శ్రీకాంత్, రాయి కంటి శ్రీనివాస్, పున్నం రవి, కాంపెల్లి అరవింద్, పుల్లెల మల్లయ్య, ప్రభాకర్, కండె రాజు,శివ, భోగేష్, సతీష్, కిషోర్, చక్రపాణి, కరీం తదితరులు పాల్గొన్నారు.




