Karimnagar: ప్రజా సమస్యలపై ఉద్యమిస్తాం.. ఉచిత విద్య, వైద్యం కోసం పోరుబాట!
Karimnagar: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఎం పోరాటానికి సిద్ధమైంది.
Karimnagar: ప్రజా సమస్యలపై ఉద్యమిస్తాం.. ఉచిత విద్య, వైద్యం కోసం పోరుబాట!
కరీంనగర్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తూనే, ఉచిత విద్య, వైద్యం కోసం దీర్ఘకాలిక పోరాటాలు చేస్తామని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు.
సిపిఎం జిల్లా కార్యాలయం ముకుంద లాల్ మిశ్రా భవన్లో పాత్రికేయుల సమావేశంలో వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల నడ్డి విరిచే విధానాలను కొనసాగిస్తూ, దేశంలో ఆర్థిక అసమానతలను పెంచుతూ,దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతూ సంపన్నులకు ఊడిగం చేస్తుందన్నారు.
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బిజెపి ప్రభుత్వం లక్షలాది ఉద్యోగాలు పోయే నిర్ణయాలు చేస్తుందన్నారు. దేశవ్యాప్తంగా యువత ఉద్యోగాలు లేక సెక్యూరిటీ గార్డులుగా, జొమాటో, ఉబర్ లాంటి సంస్థల్లో పనిచేస్తున్నారని, యువత శక్తి దేశంలో నిర్వీర్యం అవుతుందన్నారు. బిజెపి పాలనపై దేశవ్యాప్తంగా తిరుగుబాటు మొదలైందని, ముఖ్యంగా యువకుల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అందుకు ఉదాహరణ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో శనివారం చేసిన ధర్నానే నిదర్శనం అన్నారు. యువకులు స్వచ్ఛందంగా లక్షలాదిమంది ధర్నాకు వెళ్లారని, బిజెపి విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారన్నారు.
దేశంలో మహిళలపై హత్యలు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు, పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని అధికారంలోకి వచ్చిన బిజెపి అందుకు విరుద్ధంగా రైతుల ఆత్మహత్యలకు ప్రేరేపించే విధంగా నిర్ణయాలు చేస్తుందన్నారు. కార్మికులను మరింత కట్టు బానిసలు చేసే నాలుగు లేబర్ కోడ్ల ను తీసుకువచ్చి సంపన్నులకు మరింత దోచి పెట్టే అవకాశం కల్పించారన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
మహిళలకు నెలకి 2500, నిరుద్యోగ భృతి, రైతు భరోసా, కూలి భరోసా, కౌలు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై ఉద్యమిస్తూనే పార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం చేసే కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జూన్ జూలై ఆగస్టు నెలలో గ్రామాల్లో, బస్తీల్లో పర్యటనలు చేస్తామన్నారు. సమస్యలపై ఎక్కడికక్కడ ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామన్నారు. ఉచిత విద్య,వైద్యం కోసం దీర్ఘకాలిక పోరాటాలు నిర్వహిస్తామన్నారు. పట్టణ ప్రాంతాలకు ఉపాధి హామీ చట్టాన్ని విస్తరిస్తామనే హామీని తెలంగాణ సర్కారు విస్మరించిందన్నారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం అని చెప్పి తర్వాత మాట మార్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో నే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామనే హామీని విస్మరించిందన్నారు జిల్లాలో వేలాది మంది పేదలకు ఇండ్లు లేవని వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు, ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయకపోవడం మూలంగా విధి లేని పరిస్థితిలో ప్రైవేట్ పాఠశాలల్లోకి తల్లిదండ్రులు తమ పిల్లలను పంపుతున్నారని, ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు ఫీజుల పేరుతో దోపిడీ చేస్తున్నాయన్నారు.
రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం తేవాలన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ విపరీతంగా పెరిగిపోయిందని ఫీజులో నియంత్రణ లేకపోవడంతో హాస్పిటల్ యాజమాన్యాలు తమ ఇష్ట రాజ్యంగా రోగుల నుండి ఫీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. అందరికీ ఉచిత విద్య,వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఈ రెండు సౌకర్యాలు కల్పిస్తే సామాన్య ప్రజల జీవనం సాఫీగా సాగుతుందన్నారు. తెల్ల రేషన్ కార్డు పై 14 రకాల సరుకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైందని ఎరువుల కొరతను నివారించాలన్నారు. యూరియా బుకింగ్ కోసం యాప్ పనిచేయడం లేదన్నారు. డి ఏ పి రైతులకు అందుబాటులో లేకపోవడం మూలంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంప్లెక్స్ ఎరువుల ధరలు విపరీతంగా పెంచడం మూలంగా రైతుపై మరింత అదనపు భారం పడుతుంది అన్నారు. ప్రభుత్వం మార్క్ పెడ్ ద్వారా కొనుగోలు చేసిన మొక్కజొన్న పంట డబ్బులు రైతులు అకౌంట్లో వెంటనే జమ చేయాలని డిమాండ్ చేశారు.
రాబోయే మూడు నెలల కాలంలో ప్రజా సమస్యలను గ్రామస్థాయిలో అధ్యయనం చేస్తూ ప్రజా ప్రతినిధులకు అధికారులకు వినతిపత్రాలు ఇస్తూ, ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామన్నారు.
ఈ మీడియా సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గుడికందుల సత్యం, జి బీమా సాహెబ్, జిల్లా కమిటీ సభ్యులు డి నరేష్ పటేల్, జిల్లా నాయకులు పుల్లెల మల్లయ్య, పున్నం రవి, వినయ్ తదితరులు పాల్గొన్నారు.




