Karimnagar: కాంగ్రెస్ సర్కార్‌పై నిప్పులు చెరిగిన సీపీఎం.. కరీంనగర్‌లో దిష్టిబొమ్మ దహనం!

Karimnagar: కరీంనగర్‌లో సీపీఎం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 15 Jun 2026 7:38 AM IST
Karimnagar
X

Karimnagar: కాంగ్రెస్ సర్కార్‌పై నిప్పులు చెరిగిన సీపీఎం.. కరీంనగర్‌లో దిష్టిబొమ్మ దహనం!

కరీంనగర్ : ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు అనేక హామీలు, వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తవుతున్న నేటికీ హామీలు అమలు చేయకపోవడం సిగ్గుచేటని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవ రెడ్డి ఆరోపించారు.

జిల్లా కేంద్రంలోని కమాన్ చౌరస్తా వద్ద రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు అనేక డిక్లరేషన్లు ప్రకటించి వాటిని అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు.

రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి 15000 ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత 12000 మాత్రమే ఇస్తామని అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు దఫాలుగా రైతులకు రైతు భరోసా నిధులు ఎగ్గొట్టారని, గత రబీ సీజన్ పెట్టుబడి సాయం రైతు భరోసా నిధులు నేటికీ పూర్తిస్థాయిలో రైతుల అకౌంట్లో వేయకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఏప్రిల్ నెలలో ఎకరానికి 6000 రైతుల అకౌంట్లో వేసి చేతులు దులుపుకున్నారన్నారు. మే మాసంలో పూర్తిస్థాయిలో రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని ప్రకటించి ఆచరణలో విఫలమయ్యారన్నారు. కౌలు భరోసా, కూలి భరోసా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

టిఆర్ఎస్ హాయంలో రెండు పంటలకు కాదు మూడు పంటలకు పెట్టుబడి సాయం ఇవ్వాలని డిమాండ్ చేసిన ముఖ్యమంత్రి నేడు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.

తాము అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో భర్తీ చేస్తామని హామీ ఇచ్చి నిరుద్యోగులను మోసం చేశారన్నారు. నిరుద్యోగ భృతి నెలకు 3116 అటకెక్కించారన్నారు. ప్రతి సంవత్సరం జూన్ మాసంలోజాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని యువకులను మోసం చేశారన్నారు. జాబ్ క్యాలెండర్ అడ్రస్ ఎక్కడ అని ప్రశ్నించారు.

పెళ్లయిన ప్రతి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి పథకం కింద లక్ష రూపాయలు, తులం బంగారం ఇస్తామని వాగ్దానం చేసి తులం బంగారం ఇవ్వకుండా ఆడబిడ్డలను మోసం చేశారన్నారు. ప్రతి మహిళకు నెలకు 2500 అకౌంట్ లో జమ చేస్తామని హామీ ఇచ్చి తుంగలోతోక్కారన్నారు. కళాశాలకు వెళ్లే బాలికలకు స్కూటీలు ఇస్తామని హామీ ఇచ్చి మర్చిపోయారన్నారు. కార్మికులకు కనీస వేతన చట్టం అమలు అమలు కావడం లేదన్నారు.

నెలకు 26000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయడం లేదన్నారు. అర్హులైన జర్నలిస్ట్ లకు నివేశన స్థలాలు ఇచ్చి, ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చి అమలు చేయడం లేదన్నారు.

రైతులకు కార్మికులకు యువజనలకు విద్యార్థులకు మహిళలకు అనేక వర్గాల ప్రజలకు ఎన్నికలకు ముందు 400కు పైగా హామీలు, డిక్లరేషన్లు ఇచ్చి అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాల పూర్తయిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయకపోవడం కాంగ్రెస్ పార్టీ దివాలా కోరు రాజకీయాలకు నిదర్శనం అన్నారు.

ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ, ప్రజలకు ఇచ్చిన హామీలను నీటి మీది రాతలుగా భావిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేసేంతవరకు ఎక్కడికక్కడ నిలదీస్తామన్నారు. రాబోయే కాలంలో ప్రజలను సమీకరించి ఎన్నికల హామీలు అమలు అయ్యేంతవరకు ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సుంకర సంపత్, ఎడ్ల రమేష్, డి నరేష్, కొప్పుల శంకర్, జిల్లా నాయకులు గజ్జల శ్రీకాంత్, ఖంపెల్లి అరవింద్, పుల్లెల మల్లయ్య, పున్నం రవి, గుండేటి వాసుదేవ్, సిహెచ్ రాములు, చక్రపాణి, అరవింద్, రాజ్ కుమార్, శివ,వడ్లూరి కిషోర్, రాజకుమారి, శ్రీరాముల నారాయణ, పిల్లి రవి, గడ్డంశోభన్, సాయికుమార్, వినయ్, భోగేష్, ఆకాష్, సన్నీ తదితరులు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story