Karimnagar: క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని అధికారుల ఆదేశం!

Karimnagar: ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు వసతి గృహాల్లో మౌలిక వసతులు విద్యా ప్రమాణాలపై సీఎస్ సంజయ్ జాజు ప్రత్యేక సమీక్ష. కలెక్టర్లకు కీలక ఆదేశాలు. పూర్తి వివరాలు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 29 Sept 2026 9:34 AM IST
Karimnagar
X

Karimnagar: క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని అధికారుల ఆదేశం!

Karimnagar: ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించడంతో పాటు విద్యా ప్రమాణాలను మరింత పెంచేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు సూచించారు. విద్యార్థుల భద్రత, హాజరు, భోజనం, పారిశుద్ధ్యం, ఉపాధ్యాయుల పనితీరు, లెర్నింగ్‌ ఔట్‌కమ్స్‌పై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు.

హైదరాబాద్‌ నుంచి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కరీంనగర్‌ కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి జిల్లా కలెక్టర్‌ చిత్రా మిశ్రా, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఆకస్మిక తనిఖీలతో నాణ్యత పరిశీలన...

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులు, భోజనం, పారిశుద్ధ్యం, వంటశాలలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు తదితర అంశాలను కలెక్టర్లు, నియమిత అధికారులు తరచూ క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా తనిఖీ చేయాలని సీఎస్‌ సూచించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యం మెరుగుపడేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని అన్నారు.

యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల నిర్మాణ పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షించాలని, 2027 విద్యా సంవత్సరం నాటికి కనీసం 15 నుంచి 20 పాఠశాలలను పూర్తి చేసేలా పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.

భోజనం, పారిశుద్ధ్యంపై నిఘా....

విద్యార్థుల డైట్‌, కాస్మోటిక్‌ ఛార్జీలు పెంచిన నేపథ్యంలో ఆ ప్రయోజనాలు విద్యార్థులకు సక్రమంగా అందేలా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. పాఠశాలలు, వసతి గృహాల్లో పారిశుద్ధ్యం, వంటశాలల పరిశుభ్రత, ఆహార పదార్థాల నాణ్యత, సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఆహార కలుషిత ఘటనలు, విద్యార్థుల ఆత్మహత్యా యత్నాలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

హాజరుపై ప్రత్యేక పర్యవేక్షణ...

ముఖ గుర్తింపు వ్యవస్థ (ఎఫ్‌ఆర్‌ఎస్‌) ద్వారా హాజరు నమోదును సమర్థవంతంగా అమలు చేయాలని, ఉపాధ్యాయుల హాజరును క్రమం తప్పకుండా సమీక్షించాలని సూచించారు. ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యే వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు. విద్యార్థుల హాజరును కూడా కలెక్టర్లు పర్యవేక్షిస్తూ హాజరు శాతం పెంచేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, సాధారణ సంక్షేమ వసతి గృహాలకు సంబంధించిన మౌలిక వసతులు, విద్యార్థుల హాజరు, భోజనం, పారిశుద్ధ్యం, ఇతర సౌకర్యాలను ఒకే సమగ్ర మానిటరింగ్‌ పోర్టల్‌ ద్వారా పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

వంటశాలలు, యూనిఫారాల పనులకు గడువులు...

నిర్మాణంలో ఉన్న కేంద్రీకృత వంటశాలల పనులను వేగవంతం చేసి నవంబర్‌ మధ్య నాటికి కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సీఎస్‌ తెలిపారు. విద్యార్థుల యూనిఫారాల తయారీని వేగవంతం చేసి అక్టోబర్‌ 20 నాటికి ప్రస్తుత యూనిఫారాల తయారీ పూర్తి చేయాలని సూచించారు. వచ్చే విద్యా సంవత్సరానికి అవసరమైన యూనిఫారాలను మే 30 నాటికి సిద్ధం చేసేలా ముందస్తు ప్రణాళిక రూపొందించాలని అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లోని కంప్యూటర్‌ ల్యాబ్‌లను సమీక్షించి విద్యార్థుల విద్యాభ్యాసానికి పూర్తిస్థాయిలో వినియోగించేలా చూడాలని సూచించారు. యూ-డైస్‌ డేటాలో డ్రాప్‌బాక్స్‌లో ఉన్న సుమారు 70–80 వేల మంది విద్యార్థుల వివరాలను పరిశీలించి సమస్యను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. సమగ్ర శిక్ష, ప్రధానమంత్రి శ్రీ కార్యక్రమాల కింద మంజూరైన నిధుల వినియోగాన్ని సమీక్షించి నిర్దేశిత ప్రయోజనాలకు సక్రమంగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

క్షేత్రస్థాయిలో సమస్యలు గుర్తించి పరిష్కరించాలి..

జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులు తరచూ పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ వసతి గృహాలను సందర్శించి క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని సీఎస్‌ సూచించారు. ప్రభుత్వ విద్య, సంక్షేమ కార్యక్రమాల ద్వారా జరుగుతున్న మంచి పనులను ప్రజలకు తెలియజేసేలా సోషల్‌ మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్‌ చిత్రా మిశ్రా అధికారులతో సమీక్ష నిర్వహించారు. పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ వసతి గృహాలను నిరంతరం పర్యవేక్షిస్తూ విద్యార్థులకు అత్యుత్తమ విద్య అందించడంతో పాటు వారి భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంక్షేమ వసతి గృహాల్లో వంటశాలలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, పారిశుద్ధ్య నిర్వహణను మెరుగు పర్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులు పాఠశాలలు, వసతి గృహాలను తరచూ సందర్శించి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ స్వామి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి అనిల్‌ ప్రకాష్‌, వివిధ సంక్షేమ వసతి గృహాల అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN