Tangallapalli: భూభారతిలో భూములు నమోదు చేయాలని దళిత రైతుల రాస్తారోకో!

Tangallapalli: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో దళిత రైతుల రాస్తారోకో. భూభారతిలో 40 ఎకరాలు నమోదు చేయాలని డిమాండ్, యూరియా అందక ఇబ్బందులు.

KALEEM, SIRICILLA
Published on: 23 Sept 2026 12:32 PM IST
Tangallapalli
X

Tangallapalli: భూభారతిలో భూములు నమోదు చేయాలని దళిత రైతుల రాస్తారోకో!

Tangallapalli: భూభారతి రికార్డుల్లో తమ భూములను నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ దళిత రైతులు రాస్తారోకో చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన రైతులు సిరిసిల్ల–సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.

తమకు భూములు ఉన్నప్పటికీ భూభారతి రికార్డుల్లో నమోదు కాకపోవడంతో సాగు చేస్తున్న పంటలకు అవసరమైన యూరియా, ఇతర ఎరువులు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములను గత బీఆర్ఎస్ ప్రభుత్వం అగ్రికల్చర్ కాలేజీ కోసం తీసుకుందని రైతులు తెలిపారు. అనంతరం తమకు మరోచోట భూములను కేటాయించి, పట్టా ప్రొసీడింగ్స్ కూడా అందజేశారని చెప్పారు. అయితే కేటాయించిన భూముల వివరాలు ఇప్పటికీ భూభారతి రికార్డుల్లో నమోదు కాలేదని పేర్కొన్నారు.

భూముల నమోదు కోసం పలుమార్లు అధికారులను ఆశ్రయించినా సమస్య పరిష్కారం కాలేదని రైతులు వాపోయారు. పట్టా ప్రొసీడింగ్స్ ఉన్నప్పటికీ అధికారిక రికార్డుల్లో భూముల వివరాలు నమోదు కాకపోవడంతో సాగు విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.

తమకు కేటాయించిన 40 ఎకరాల భూములను తక్షణమే భూభారతిలో నమోదు చేయడంతో పాటు సాగుకు అవసరమైన యూరియా, ఇతర ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం, జిల్లా అధికారులను రైతులు డిమాండ్ చేశారు.

రైతుల ఆందోళనతో సిరిసిల్ల–సిద్దిపేట ప్రధాన రహదారిపై కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించాలని రైతులు కోరారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA