Karimnagar: కరీంనగర్‌లో ట్రాన్స్‌జెండర్ల హక్కులపై అవగాహన సదస్సు!

Karimnagar: కరీంనగర్‌లో ట్రాన్స్‌జెండర్ల హక్కులు సంక్షేమంపై అవగాహన సదస్సు నిర్వహించారు వారిపై వివక్ష తొలగించి సమాన హక్కులు ఉపాధి కల్పించాలని అధికారులు తెలిపారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 24 Oct 2026 5:34 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో ట్రాన్స్‌జెండర్ల హక్కులపై అవగాహన సదస్సు!

Karimnagar: సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు, గౌరవం, ఆత్మగౌరవంతో జీవించే అవకాశాలు కల్పించాలని, ట్రాన్స్‌జెండర్ల పట్ల వివక్షను తొలగించి వారిని సమాజంలో అంతర్భాగంగా గుర్తించాలని కరీంనగర్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యశ్వంత్ సింగ్ అన్నారు.

కరీంనగర్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సహకారంతో, ఇండియా హెచ్‌ఐవీ ఎయిడ్స్ అలయన్స్ (India HIV/AIDS Alliance) సంస్థ మద్దతుతో చేతన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలోని సాహస్ (SAHAS) ప్రాజెక్టు ద్వారా ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ సభ్యుల కోసం అవగాహన, స్టేక్‌హోల్డర్ల సెన్సిటైజేషన్ సమావేశాన్ని నిర్వహించారు.

ట్రాన్స్‌జెండర్లు ఎదుర్కొంటున్న సామాజిక, కుటుంబపరమైన, ఆర్థిక సమస్యలపై చర్చించడం, వారి హక్కులపై అవగాహన కల్పించడం, న్యాయ సహాయం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఉపాధి అవకాశాలను వారికి అందుబాటులోకి తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యశ్వంత్ సింగ్, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజగోపాల్ రావు గారు పోలీస్ ఇన్‌స్పెక్టర్ పుల్లయ్య, జిల్లా బాలల సంక్షేమ కమిటీ (CWC) చైర్‌పర్సన్ ధనలక్ష్మి హాజరయ్యారు.

ట్రాన్స్‌జెండర్లు కుటుంబం నుంచే వివక్షను ఎదుర్కొంటున్నారు... కోట శివకుమార్

ఈ సందర్భంగా చేతన స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు కోట శివకుమార్ మాట్లాడుతూ, ట్రాన్స్‌జెండర్లు నేటికీ సమాజంలో అనేక సామాజిక, ఆర్థిక, కుటుంబపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా వారి సమస్యలు కుటుంబం నుంచే ప్రారంభమవుతున్నాయని, తమ లింగ గుర్తింపును వెల్లడించిన తర్వాత కొంతమంది కుటుంబ సభ్యులు వారిని ఇంటి నుంచి బయటకు పంపించడం, తిరిగి ఇంట్లోకి రానివ్వకపోవడం, కుటుంబ ఆస్తిలో వాటా పొందకుండా అడ్డుకోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

అంతేకాకుండా, ఇంటి నుంచి వెళ్లగొట్టే సమయంలో వారి విద్యార్హత సర్టిఫికెట్లు, ఇతర ముఖ్యమైన పత్రాలు, గుర్తింపు కార్డులు ఇవ్వకపోవడం వల్ల చదువును కొనసాగించడం, ఉద్యోగాలు పొందడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవడం వంటి అంశాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు.

కుటుంబం, సమాజం నుంచి తగిన ఆదరణ, ఉపాధి అవకాశాలు లభించకపోవడంతో కొందరు ట్రాన్స్‌జెండర్లు జీవనోపాధి కోసం భిక్షాటనపై ఆధారపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల వారు సమాజంలో చిన్నచూపుకు గురవుతూ, ఆర్థికంగా వెనుకబడటంతో పాటు అనేక అవమానాలను ఎదుర్కొంటున్నారని అన్నారు.

ట్రాన్స్‌జెండర్లకు విద్య, ఆరోగ్యం, ఉపాధి, నివాసం, సామాజిక భద్రత, న్యాయ సహాయం వంటి ప్రాథమిక అవసరాలు అందుబాటులోకి రావాలని, వారిని సమాన హక్కులు కలిగిన పౌరులుగా గుర్తించాలని కోట శివకుమార్ కోరారు. ప్రభుత్వ శాఖలు, న్యాయ వ్యవస్థ, పోలీసు శాఖ, సంక్షేమ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేసి ట్రాన్స్‌జెండర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

ట్రాన్స్‌జెండర్ల ఆర్థిక అభివృద్ధికి సంక్షేమ శాఖ సహకారం... సరస్వతి

జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి మాట్లాడుతూ, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం కోసం తమ శాఖ తరఫున గుర్తింపు కార్డుల మంజూరు, ఆర్థిక అభివృద్ధికి అవసరమైన రుణాలు, పూర్తి సబ్సిడీతో కూడిన రుణ సదుపాయాలు తదితర సహాయక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.

ఇంకా అర్హత కలిగిన ట్రాన్స్‌జెండర్లు ఎవరైనా ఉంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి అవసరమైన సహాయం అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ట్రాన్స్‌జెండర్లలో ఉన్న నైపుణ్యాలను గుర్తించి, వారికి అవసరమైన శిక్షణ అందించడం, ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా వారు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రోత్సహిస్తామని తెలిపారు.

ప్రభుత్వ పథకాలు, రుణ సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల గురించి కమ్యూనిటీ సభ్యులకు అవగాహన కల్పించడం అవసరమని ఆమె పేర్కొన్నారు. సంబంధిత శాఖలను సంప్రదించి, అందుబాటులో ఉన్న సంక్షేమ పథకాలను అర్హులైన ట్రాన్స్‌జెండర్లు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు.

హక్కుల సాధనకు ముందుకు రావాలి – అండగా ఉంటాం... యశ్వంత్ సింగ్

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యశ్వంత్ సింగ్ మాట్లాడుతూ, ట్రాన్స్‌జెండర్ల హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం అనేక చట్టాలు, కార్యక్రమాలు తీసుకొచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో వారు ఇంకా వివక్షను ఎదుర్కొంటున్నారని అన్నారు.

సమాజంలో ఇతరులతో సమానంగా గౌరవప్రదమైన జీవితం గడపడానికి ట్రాన్స్‌జెండర్లు తమ హక్కులపై అవగాహన పెంపొందించుకొని, వాటిని సాధించేందుకు ముందుకు రావాలని సూచించారు. తమ సమస్యలను వెల్లడించడానికి, న్యాయ సహాయం పొందడానికి ఎవరూ వెనుకాడవద్దని తెలిపారు.

ట్రాన్స్‌జెండర్లు తమ సమస్యలతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదిస్తే, అందుబాటులో ఉన్న న్యాయ సహాయం, హక్కుల పరిరక్షణకు సంబంధించిన మార్గదర్శకత్వం అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. అర్హులైన ట్రాన్స్‌జెండర్లు తమ నైపుణ్యాలకు తగిన అవకాశాలను పొందేందుకు సంబంధిత శాఖల సహకారంతో అవసరమైన మార్గనిర్దేశం అందించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.

అలాగే ట్రాన్స్‌జెండర్లకు రేషన్ కార్డులు, నివాస గృహాలు, గుర్తింపు పత్రాలు, సామాజిక భద్రత, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు వంటి ప్రాథమిక అవసరాలు అందేలా వారి సమస్యలను సంబంధిత ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున కృషి చేస్తామని యశ్వంత్ సింగ్ వెల్లడించారు.

ట్రాన్స్‌జెండర్ల సమగ్ర అభివృద్ధికి సమన్వయం అవసరం...

ఈ అవగాహన కార్యక్రమంలో ట్రాన్స్‌జెండర్లు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, వారి హక్కులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, న్యాయ సహాయం, ఉపాధి అవకాశాలపై చర్చించారు. ట్రాన్స్‌జెండర్లకు కుటుంబం నుంచి మొదలుకొని విద్యాసంస్థలు, కార్యాలయాలు, ప్రజా ప్రదేశాల వరకు అన్ని రంగాల్లో సమాన గౌరవం, అవకాశాలు లభించాల్సిన అవసరాన్ని వివరించారు.

ట్రాన్స్‌జెండర్లు తమ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి, అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలు, న్యాయ సేవలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వ శాఖలు, న్యాయ సేవాధికార సంస్థ, పోలీసు శాఖ, సంక్షేమ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, కమ్యూనిటీ నాయకులు సమన్వయంతో పనిచేసినప్పుడే ట్రాన్స్‌జెండర్ల సామాజిక, ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.

ఇండియా హెచ్‌ఐవీ ఎయిడ్స్ అలయన్స్ సంస్థ సహకారంతో చేతన స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న సాహస్ (SAHAS) ప్రాజెక్టు ద్వారా ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ అభివృద్ధి, హక్కుల పరిరక్షణ, ఆరోగ్య సేవలపై అవగాహన, ప్రభుత్వ సంక్షేమ పథకాలతో అనుసంధానం, సామాజిక గౌరవం, సమాన అవకాశాల కల్పన వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ సంబంధిత వర్గాలతో సమన్వయానికి కృషి చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో చేతన స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు కోట శివకుమార్, వి. శివయ్య, సంస్థ సిబ్బంది సంజీవ్, గోల్డీ, శివాని, లాస్య, కోమలి, ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ నాయకులు, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN