Sircilla: బొప్పాపూర్ ఉపకేంద్రాన్ని తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ!
Sircilla: బొప్పాపూర్ ఉపకేంద్రాన్ని సిరిసిల్ల డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ తనిఖీ చేశారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు వైద్య సేవలు సకాలంలో అందించాలని ఆదేశించారు.
Sircilla: బొప్పాపూర్ ఉపకేంద్రాన్ని తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ!
సిరిసిల్ల: ఎల్లారెడ్డిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని బొప్పాపూర్ ఉపకేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపకేంద్రంలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు, మందుల లభ్యత, రికార్డుల నిర్వహణను పరిశీలించారు.
గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న ఆరోగ్య సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ప్రభుత్వ ఆరోగ్య సేవలు సకాలంలో అందేలా సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని డీఎంహెచ్‌ఓ సూచించారు. గర్భిణీలకు ఆరోగ్య పరీక్షలు, టీకాల కార్యక్రమం, కుటుంబ సంక్షేమ సేవలు సమర్థవంతంగా అందించాలని ఆదేశించారు.
అలాగే సాధారణ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రతను పాటించాలని సూచించారు. బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ, అవసరమైన మందుల లభ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీలో ప్రోగ్రామ్ అధికారి నయీమ్ జహా తదితరులు పాల్గొన్నారు.




