Yellareddypeta: గణేష్ మండపాల నిర్వాహకులతో పోలీసుల సమావేశం!

Yellareddypeta: ఎల్లారెడ్డిపేటలో గణేష్ ఉత్సవాల నిర్వహణపై డీఎస్పీ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం. డీజేలపై నిషేధం, పోర్టల్ నమోదు తప్పనిసరి.

KALEEM, SIRICILLA
Published on: 13 Sept 2026 7:12 AM IST
Yellareddypeta
X

Yellareddypeta: గణేష్ మండపాల నిర్వాహకులతో పోలీసుల సమావేశం!

Yellareddypeta: గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని సిరిసిల్ల డీఎస్పీ కే. నాగేంద్ర చారి సూచించారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని సాయి శివ గార్డెన్‌లో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, మండప నిర్వాహకులు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డీఎస్పీ నాగేంద్ర చారి మాట్లాడుతూ.. ప్రతి గణేష్ మండప నిర్వాహకుడు గణేష్ పోర్టల్–2026లో మండపానికి సంబంధించిన వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రజా రవాణాకు, అత్యవసర వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా మండపాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.

ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, మండపాలను జియో ట్యాగింగ్ చేసి టీజీ-కాప్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయనున్నట్లు తెలిపారు. జియో ట్యాగింగ్ ద్వారా సంబంధిత ఎస్‌హెచ్‌ఓలు మండపాల వద్ద పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే అవకాశం ఉంటుందని వివరించారు.

గణేష్ విగ్రహాల ఏర్పాటు నుంచి నిమజ్జనం వరకు పోలీసుల సూచనలు, నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని డీఎస్పీ కోరారు. శోభాయాత్ర సమయంలో పోలీస్ శాఖ రూపొందించిన రూట్ మ్యాప్‌ను తప్పనిసరిగా అనుసరించాలని తెలిపారు.

గణేష్ మండపాలు, శోభాయాత్ర, నిమజ్జనం సందర్భంగా డీజేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని స్పష్టం చేశారు. అనుమతి లేకుండా డీజేలు వినియోగిస్తే నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రాత్రి 10 గంటల వరకు రెండు చిన్న స్పీకర్లకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు.

సోషల్ మీడియాలో విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు పెట్టడం, వాస్తవాలను నిర్ధారించుకోకుండా వాటిని ఫార్వర్డ్ చేయడంపై ప్రత్యేక నిఘా ఉంటుందని డీఎస్పీ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

విద్యుత్ శాఖ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవడంతో పాటు విద్యుత్ షార్ట్‌సర్క్యూట్, అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు, ఫైర్ బాల్స్, నీటి బకెట్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు.

ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని డీఎస్పీ నాగేంద్ర చారి తెలిపారు. ఏదైనా ఇబ్బంది తలెత్తితే వెంటనే డయల్-112కు లేదా స్థానిక పోలీసులను సంప్రదించాలని సూచించారు.

ఈ సమావేశంలో ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఓ. వెంకటేష్, ఎస్సై ఎన్. రమేష్, గణేష్ మండపాల నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA