Sircilla: ఆయిల్ పామ్ సాగువైపు రైతులను ప్రోత్సహించాలి: కలెక్టర్ గరిమ
Sircilla: సిరిసిల్ల జిల్లాలో ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని, ప్రస్తుతం టన్ను ధర రూ.24,025గా ఉందని కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.
Sircilla: ఆయిల్ పామ్ సాగువైపు రైతులను ప్రోత్సహించాలి: కలెక్టర్ గరిమ
సిరిసిల్ల: ఆయిల్ పామ్ సాగుతో వచ్చే లాభాలు, ప్రభుత్వ సబ్సిడీలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తూ.. సాగువైపు ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు.
ఆయిల్ పామ్ సాగు పురోగతి, నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవడంపై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఉద్యానవన, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రి-యునిక్ కంపెనీ, డ్రిప్ కంపెనీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మంగళవారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులు జిల్లాలో ఆయిల్ పామ్ సాగు పురోగతిని కలెక్టర్‌కు వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 709 ఎకరాలకు డ్రిప్ ఆమోదం లభించగా.. 502 ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటినట్లు తెలిపారు. ఈ వారంలో జిల్లావ్యాప్తంగా 143 టన్నుల ఆయిల్ పామ్ దిగుబడి రాగా.. రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.35 లక్షలు జమ అయినట్లు వివరించారు. ప్రస్తుతం ఆయిల్ పామ్ టన్ను ధర రూ.24,025గా ఉందని తెలిపారు.
రైతులకు ఆయిల్ పామ్ మద్దతు ధర, దిగుబడి ద్వారా కలిగే ఆర్థిక ప్రయోజనాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, సబ్సిడీలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. రైతులకు అవసరమైన సమాచారం, సహకారం అందించేలా ఉద్యానవన, వ్యవసాయ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఆయిల్ పామ్ సాగుపై ఆసక్తి ఉన్న రైతులు ఉద్యానవన అధికారి, వ్యవసాయ విస్తరణ అధికారి లేదా ఆయిల్ పామ్ కంపెనీ సిబ్బందిని సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. పూర్తి వివరాల కోసం సిరిసిల్ల డివిజన్ ఉద్యానవన అధికారి వి. గోవర్ధన్‌ను 89777 14049, వేములవాడ డివిజన్ ఉద్యానవన అధికారి సీహెచ్. లోకేష్‌ను 89777 14048 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.
సమావేశంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఆర్. శరత్ బాబు, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, ఉద్యానవన శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.




