Sircilla: ఇందిరమ్మ కుటుంబ బీమా నమోదు పక్కాగా ఉండాలి: కలెక్టర్!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో డిసెంబర్ 19 వరకు కొనసాగే ఇందిరమ్మ కుటుంబ బీమా శిబిరాల్లో వివరాల నమోదు పక్కాగా ఉండాలని శుక్రవారం కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.

KALEEM, SIRICILLA
Published on: 20 Nov 2026 3:49 PM IST
Sircilla
X

Sircilla: ఇందిరమ్మ కుటుంబ బీమా నమోదు పక్కాగా ఉండాలి: కలెక్టర్!

రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సందర్భంగా జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలతో పాటు అన్ని గ్రామపంచాయతీల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ శిబిరాలు డిసెంబర్ 19వ తేదీ వరకు కొనసాగనున్నాయి.

ఇందులో భాగంగా శుక్రవారం వేములవాడ అర్బన్ మండలం ఆర్ అండ్ ఆర్ కాలనీ చీర్లవంచ, సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 23వ వార్డులో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కేంద్రాల్లో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌లు, రిజిస్టర్లలో నమోదు చేస్తున్న దరఖాస్తుదారుల వివరాలను పరిశీలించి, ఇప్పటివరకు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆన్‌లైన్‌లో వివరాల నమోదు ప్రక్రియను పరిశీలించి, దరఖాస్తు పూర్తి చేసేందుకు పడుతున్న సమయంపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వివరాలను ప్రజలందరికీ చేరవేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి దరఖాస్తులో బీమా వివరాలు, నామినీ వివరాలను ఎలాంటి తప్పులు లేకుండా పక్కాగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. దరఖాస్తుదారులు రేషన్ కార్డు, ఫోన్ నంబర్ వివరాలను అందించాలని సూచించారు. ప్రజలకు అవసరమైన సమాచారం అందించేందుకు అన్ని ప్రత్యేక కేంద్రాల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

అనంతరం సిరిసిల్లలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన కరపత్రాలను కలెక్టర్ గరిమ అగ్రవాల్, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళతో కలిసి ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో వేములవాడ ఆర్డీఓ కేఎస్‌బీ కుమారి, నోడల్ అధికారి, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, సిరిసిల్ల 23వ వార్డు సభ్యురాలు ఆడెపు చంద్రకళ, మున్సిపల్ కమిషనర్ ఖాదీర్ పాషా, తహసీల్దార్లు జయంత్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA