Peddapalli: అర్హులైన ప్రతి ఓటరుకు ఓటు హక్కు కల్పించడమే ఎస్ఐఆర్ లక్ష్యం: అబ్జర్వర్!
Peddapalli: పెద్దపల్లి కలెక్టరేట్‌లో గురువారం ఎస్ఐఆర్-2026 ప్రక్రియపై రోల్ అబ్జర్వర్ బి. బాలమయి దేవి, కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీక్ష నిర్వహించారు.
Peddapalli: అర్హులైన ప్రతి ఓటరుకు ఓటు హక్కు కల్పించడమే ఎస్ఐఆర్ లక్ష్యం: అబ్జర్వర్!
Peddapalli: ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) 2026 ప్రక్రియలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా అధికారులు పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని రోల్ అబ్జర్వర్ బి. బాలమయి దేవి సూచించారు.
సరైన విచారణ, ఆధారాలు లేకుండా ఏ ఒక్క అర్హుడి పేరును ఓటరు జాబితా నుంచి తొలగించడానికి వీల్లేదని, ప్రతి ఓటరు హక్కును పరిరక్షించేలా ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పక్కాగా అమలు చేయాలని స్పష్టం చేశారు.
గురువారం పెద్దపల్లి జిల్లా సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీరాములు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె. అరుణశ్రీతో కలిసి ఎస్‌ఐఆర్ 2026 ప్రక్రియ పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రోల్ అబ్జర్వర్ బి. బాలమయి దేవి మాట్లాడుతూ, పెద్దపల్లి జిల్లాలో ఎస్‌ఐఆర్ 2026 ప్రక్రియ పురోగతి బాగుందని, ఇదే విధంగా కొనసాగిస్తే నిర్దేశిత గడువులోగా ప్రక్రియను సజావుగా పూర్తి చేయవచ్చని తెలిపారు.
జిల్లాలోని ఏఎస్‌డీ (Absent, Shifted, Death) జాబితాలో అర్హులైన ఓటర్లు ఎవరైనా ఉంటే వారికి భారత ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించిందని, ఈ అవకాశాన్ని సమర్థవంతంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో ఏఎస్‌డీ జాబితాను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి, అందులోని ప్రతి ఓటరు వివరాలను క్షేత్రస్థాయిలో ధ్రువీకరించాలని ఆదేశించారు.
బూత్ స్థాయి అధికారుల వివరాలు ప్రతి ఓటరుకు తెలిసేలా చర్యలు తీసుకోవాలని, ఓటరు జాబితా నుంచి ఏ ఒక్కరి పేరును తొలగించినా అందుకు సరైన కారణాలు, ఆధారాలు ఉండాలని స్పష్టం చేశారు. అనవసరంగా అర్హులైన ఏ ఒక్కరి ఓటు కూడా తొలగించడానికి వీల్లేదని పేర్కొన్నారు.
ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడటం అధికారుల బాధ్యత అని, సరైన విచారణ లేకుండా ఎలాంటి తొలగింపులు చేపట్టరాదని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ఫారం-7, ఫారం-8 దరఖాస్తులను సమాంతరంగా పరిశీలించి పరిష్కరించాలని, నూతన ఓటర్లకు ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, పెద్దపల్లి జిల్లాలో మొత్తం 81,139 మంది ఓటర్లు ఏఎస్‌డీ జాబితాలో ఉన్నారని తెలిపారు. బూత్ స్థాయి అధికారుల ద్వారా ఏఎస్‌డీ జాబితాలోని ప్రతి ఓటరు వివరాలను మరోసారి క్షేత్రస్థాయిలో ధ్రువీకరిస్తున్నామని వివరించారు.
జిల్లాలో మొత్తం 20,063 మ్యాపింగ్ కాని ఓటర్లు, 1,27,455 అనామలీ ఓటర్లను గుర్తించినట్లు తెలిపారు. మొత్తం 1,47,159 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసి విచారణ నిర్వహించామని వివరించారు. వీరిలో 1,42,572 మందిని అర్హులుగా గుర్తించి తుది ఓటరు జాబితాలో నమోదు చేసేందుకు సిద్ధంగా ఉంచామని, 5,177 మందిని అనర్హులుగా గుర్తించినట్లు తెలిపారు.
జిల్లాకు కొత్తగా అందిన ఫారం-7, ఫారం-8తో పాటు ఇతర దరఖాస్తులను కూడా సమాంతరంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం పరిశీలించి, అర్హులైన ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
ఎస్‌ఐఆర్ షెడ్యూల్ ప్రకారం తుది ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరిస్తూ ప్రతి దశను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, నిర్దేశిత గడువులోగా ప్రక్రియను పూర్తి చేస్తామని కలెక్టర్ వివరించారు.
ఈ సమావేశంలో రెవెన్యూ డివిజన్ అధికారులు కే. సురేష్, బి. గంగయ్య, తహసీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




