Karimnagar: కరీంనగర్ అక్రమ లేఅవుట్లపై సీఎం రేవంత్ రెడ్డి నిఘా పెట్టాలి
Karimnagar: కరీంనగర్ మున్సిపల్, సుడా (SUDA) అధికారుల అవినీతిపై మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్ మండిపడ్డారు.
Karimnagar: కరీంనగర్ అక్రమ లేఅవుట్లపై సీఎం రేవంత్ రెడ్డి నిఘా పెట్టాలి
కరీంనగర్: కరీంనగర్ నగర మున్సిపల్ కార్పొరేషన్‌లో జరుగుతున్న అవినీతి, అక్రమ లేఅవుట్లు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, టౌన్ ప్లానింగ్ లో అవకతవకలపై నేడు కరీంనగర్ మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్ మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో నూతనంగా విలీనమైన గ్రామాల్లో “నయా దందా” మొదలైందని ఆరోపించారు. అక్రమ లేఅవుట్లకు మున్సిపల్ కార్పొరేషన్, శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (SUDA) అధికారులు ప్రత్యక్షంగా సహకరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
నెల రోజుల క్రితమే పత్రికల ద్వారా అనేక సర్వే నంబర్లలో జరుగుతున్న ఇల్లీగల్ లేఅవుట్లపై అధికారులను అప్రమత్తం చేశామని, అయినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. నగరంలోని సర్వే నంబర్లు 52, 53, 85, 102, 115 సహా అనేక ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ప్లాట్లు విక్రయిస్తున్నారని తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి చిట్టా తమ వద్ద ఉందని వెల్లడించారు.
అక్రమ లేఅవుట్ల పేరుతో ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల నష్టం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టబద్ధమైన లేఅవుట్లలో 10 శాతం భూమిని పార్కులు, రోడ్లు, డ్రైనేజీ, పైప్‌లైన్‌లు, సామాజిక అవసరాల కోసం కేటాయించాల్సి ఉంటుందని, కానీ అధికారులు రూల్స్‌ను పక్కనబెట్టి అక్రమంగా అనుమతులు ఇస్తున్నారని ఆరోపించారు.
చింతకుంట ప్రాంతంలోని ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 439లో రెండు ఎకరాలకు పైగా భూమిని అక్రమంగా ప్లాట్లుగా మార్చి మార్కెట్‌లో అమ్ముతున్నారని ఆరోపిస్తూ ఆధారాలను బయటపెట్టారు. “అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు ప్రభుత్వ భూములను కొల్లగొడుతున్నారు” అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు.
శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో “గేటెడ్ కమ్యూనిటీ” పేరుతో కొత్త తరహా అక్రమాలకు తెరలేపారని అన్నారు. 10 శాతం స్థలాన్ని కేటాయించకుండా, రోడ్లు, నీటి పైప్‌లైన్లు, పార్కులు, కాంపౌండ్ వాల్ వంటి ప్రాథమిక సదుపాయాలు లేకుండానే లేఅవుట్లు మంజూరు చేస్తున్నారని ఆరోపించారు.
అల్గునూరు ప్రాంతంలో ప్రభుత్వ భూములు, సాగుభూములను టౌన్ ప్లానింగ్ అధికారులతో కుమ్మక్కై ఓపెన్ ప్లాట్లుగా మార్చి, చుట్టూ ప్రహరీ గోడలు కట్టి యథేచ్ఛగా అమ్ముకుంటున్నారని ఆరోపించారు. “ఇంత జరుగుతున్నా పట్టించుకునే నాథుడు లేడు” అని వ్యాఖ్యానించారు.
ఇప్పటివరకు నగరంలో ఒక్క లీగల్ లేఅవుట్‌కు కూడా సరైన ప్రాధాన్యత ఇచ్చారా అని ప్రశ్నించిన ఆయన, SUDA పరిధిలో మంజూరైన లేఅవుట్లలో 10 శాతం భూమి నిజంగా కేటాయించారా అనే అంశంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
లేఅవుట్ అంటే పూర్తి స్థాయిలో రోడ్లు, డ్రైనేజీ, పైప్‌లైన్లు, ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్, పార్కులు వంటి మౌలిక సదుపాయాలు ఉండాలని, కానీ ప్రస్తుతం కేవలం ప్లాట్ల అమ్మకాలకే పరిమితమైందని విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన అధికారులు వాటిని దోచుకునే స్థాయికి దిగజారారని మండిపడ్డారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అడ్డాగా మారిందని ఆరోపించిన ఆయన, అపార్ట్‌మెంట్‌లలో 10 శాతం కంటే ఎక్కువ డివియేషన్ ఉన్నా భారీ మొత్తాలు వసూలు చేసి ఆక్యుపేషన్ సర్టిఫికెట్లు ఇస్తున్నారని పేర్కొన్నారు. రెండు సార్లు తిరస్కరించిన ఫైల్ మూడోసారి డబ్బులు ముడితే ఎలా ఆమోదం పొందుతుందని ప్రశ్నించారు.
“మున్సిపల్ బడ్జెట్ కంటే టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతి సంపాదనే ఎక్కువగా ఉంది. ఇక్కడికి బదిలీపై వచ్చే అధికారులు గోనె సంచులు తెచ్చుకుని మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు” అంటూ ఎద్దేవా చేశారు.
ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే పేదవారికి వందల నిబంధనలు చెప్పే అధికారులు, కోట్ల రూపాయల అక్రమ నిర్మాణాలపై మాత్రం కన్నెత్తి చూడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యులపై ప్రతాపం చూపే అధికారులు, అక్రమార్కుల ముందు మోకరిల్లుతున్నారని మండిపడ్డారు.
రాష్ట్ర మున్సిపల్ శాఖను పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే మున్సిపాలిటీలపై దృష్టి సారించాలని కోరారు. “మున్సిపాలిటీ, SUDA ఆస్తులను పెంచుకుంటే భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది. కానీ ప్రస్తుతం అమ్మకాలు, బేరసారాలు, అవినీతి మాత్రమే జరుగుతున్నాయి” అని వ్యాఖ్యానించారు.
వ్యవసాయ భూములను కూడా ల్యాండ్ యూజ్ కన్వర్షన్ లేకుండానే కమర్షియల్ ప్లాట్లుగా మార్చి అమ్ముతున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఆదాయం పెంచే దిశగా ఆలోచించకుండా అధికారులు మొత్తం బేరసారాలకే పరిమితమయ్యారని విమర్శించారు.
వెంటనే చర్యలు తీసుకోవాలి : సర్ధార్ రవీందర్ సింగ్ “నగరంలో ఒక్క ఇంచ్ ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనా ఊరుకోము. బీఆర్ఎస్ పార్టీ తరపున బాధితుల పక్షాన పోరాటం చేస్తాం. నగరానికి రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయం దెబ్బతింటోంది. వెంటనే ఇల్లీగల్ లేఅవుట్లు ఆపి కఠిన చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు.




