Sircilla: అన్న కోమాలో ఉన్నా మారని తమ్ముడి తీరు.. ఆస్తి కోసం అమానవీయం!

Sircilla: సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లిలో భూమి వివాదం.

KALEEM, SIRICILLA
Published on: 13 Jun 2026 11:30 AM IST
Sircilla
X

Sircilla: అన్న కోమాలో ఉన్నా మారని తమ్ముడి తీరు.. ఆస్తి కోసం అమానవీయం!

Sircilla: సిరిసిల్ల జిల్లాలో భూమి వివాదం అన్నదమ్ముల బంధాన్ని బలిచేస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల మధ్య భూమి వాటాల వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రస్తుతం కోమాలో ఉన్న అన్నకు చికిత్స కోసం తన వాటా భూమి డబ్బులు ఇవ్వాలని కుటుంబ సభ్యులు వేడుకున్నా ఫలితం లేకపోవడంతో బాధ్యత కుటుంబానికి అండగా నిలిచి గ్రామస్తులే పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు.

ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామానికి చెందిన నేదూరి రాజయ్య-నర్సవ్వ దంపతుల కుమారులు దేవయ్య, శ్రీనివాస్, ప్రవీణ్‌, రాజు. దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యుల సంపాదనతో గ్రామంలో రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అయితే ఆ భూమిని రెండో కుమారుడు శ్రీనివాస్ తన పేరిట పట్టా చేయించుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఈ విషయంపై గతంలో గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగినప్పటికీ, భూమి వాటాల సమస్యకు పూర్తి పరిష్కారం కాలేదు. ఇదే సమయంలో గత నెల తాటి చెట్టు ఎక్కి ముంజలు కోస్తుండగా దేవయ్య ప్రమాదవశాత్తు కిందపడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం చికిత్స పొందుతూ కోమా స్థితిలో ఉన్నాడు.

దేవయ్య చికిత్స కోసం ఇప్పటికే లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు తీవ్రంగా ఉండటంతో తమ వాటా భూమికి సంబంధించిన డబ్బులు ఇవ్వాలని శ్రీనివాస్‌ను వేడుకున్నప్పటికీ స్పందించలేదని బాధితులు చెబుతున్నారు,

అన్న ప్రాణాపాయ స్థితిలో ఉన్న సమయంలోనూ సహకరించకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ నేరుగా గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

కోమాలో ఉన్న దేవయ్యకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సహాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. అక్కపల్లిలో భూమి వివాదం ఇప్పుడు కుటుంబ బంధాలకే పరీక్షగా మారింది.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story