Peddapalli: ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే కుట్రలు: దాసరి!
Peddapalli: అసెంబ్లీ గేటు వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై దాడి, కేసీఆర్‌పై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
Peddapalli: ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే కుట్రలు: దాసరి!
పెద్దపల్లి: పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరి మనోహర్ రెడ్డి నేడు పెద్దపల్లిలోని బీఆర్‌ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నుంచే ప్రజల దృష్టిని మళ్లించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వివిధ అంశాలను తెరపైకి తీసుకువస్తోందని దాసరి మనోహర్ రెడ్డి విమర్శించారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నల్ల టీషర్టులు ధరించి అసెంబ్లీకి రావడాన్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ నిరసన వ్యక్తం చేయడం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు.
అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసులు దురుసుగా వ్యవహరించడం, భౌతికంగా దాడి చేయడం, మహిళా ఎమ్మెల్యేల పట్ల కూడా అనుచితంగా వ్యవహరించడం తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకు తమ ప్రజల సమస్యలను సభలో వినిపించే హక్కు ఉందని, ఆ హక్కును అడ్డుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు.
అదేవిధంగా, మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి కొందరు కాంగ్రెస్ నాయకులు అనుచితంగా వ్యవహరించడం, ఆయనకు హాని కలగాలని కోరుతూ నినాదాలు చేయడం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తెలంగాణ ప్రజల మనోభావాలను అవమానించడమేనని అన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలు, ఎన్నికల హామీల అమలు వంటి అసలు ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇలాంటి వివాదాస్పద ఘటనలను తెరపైకి తీసుకువస్తున్నారని ఆరోపించారు. ప్రజల దృష్టిని ఎంతకాలం మళ్లించినా ప్రభుత్వం ఇచ్చిన హామీలు, చేసిన పనులను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కక్షపూరిత రాజకీయాలను పక్కనపెట్టి ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలని, ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలకు తగిన గౌరవం ఇవ్వాలని దాసరి మనోహర్ రెడ్డి కోరారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసి, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ పట్టణ మండలాల అధ్యక్షులు మాజీ సర్పంచ్లు కార్యకర్తలు పాల్గొన్నారు.




