Peddapalli: భూ నిర్వాసితులకు పరిహారం అందే వరకు పోరాటం:..పుట్ట మధు హెచ్చరిక!

Peddapalli: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రాజాపూర్‌లో సింగరేణి భూ నిర్వాసితులకు పరిహారం అందకపోతే పోరాటం చేస్తామని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు హెచ్చరించారు.

SHANKAR, MANTHANI
Published on: 11 Nov 2026 4:56 PM IST
Peddapalli
X

Peddapalli: భూ నిర్వాసితులకు పరిహారం అందే వరకు పోరాటం:..పుట్ట మధు హెచ్చరిక!

Peddapalli: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగరేణి ప్రభావిత గ్రామమైన రాజాపూర్‌లో భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించడంలో జాప్యం చేస్తున్న సింగరేణి అధికారుల తీరుపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజాపూర్ గ్రామాన్ని సందర్శించిన ఆయన సింగరేణి బ్లాస్టింగ్ కారణంగా దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి, బాధితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన సమావేశంలో బాధితులను ఉద్దేశించి పుట్ట మధు మాట్లాడుతూ రాజాపూర్ భూ నిర్వాసితులు అనేక రోజులైనా నష్టపరిహారం రావడంలేదని తమకు అండగా ఉండి నష్టపరిహారం ఇప్పించాలని తన దగ్గరికి వచ్చి రమ్మంటే వచ్చినానని అన్నారు.

సింగరేణి ప్రభావిత గ్రామమైన రాజాపూర్‌లోని భూ నిర్వాసితులందరికీ న్యాయంగా పరిహార ప్యాకేజీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పనిచేసే పార్టీ బీఆర్ఎస్ అని పేర్కొన్నారు.

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సింగరేణి భూ నిర్వాసితుల సమస్యలను పెండింగ్‌లో పెట్టిందని, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుందని అన్నారు. సింగరేణి సంస్థతో చర్చించి, ఒప్పించి అనేక సమస్యలను పరిష్కరించామని పేర్కొన్నారు.

ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సంస్థను ఏటీఎంలా ఉపయోగించుకుంటోందని విమర్శించారు. సింగరేణి ప్రభావిత ప్రాంతాల ప్రజల సమస్యలను పట్టించుకోకుండా, వారి ఆకాంక్షలను నెరవేర్చకుండా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజలకు న్యాయం చేయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సింగరేణి యాజమాన్యాన్ని నిలదీసేందుకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

సింగరేణి ప్రభావిత గ్రామంలో ఇల్లు ఉన్నప్పటికీ అక్కడ నివాసం ఉండటం లేదనే కారణంతో పరిహారం నిరాకరించడం ఎంతవరకు సమంజసమని అధికారులను ప్రశ్నించారు. సింగరేణి స్వచ్ఛంద సంస్థ కాదని, భూముల నుంచి బొగ్గు వెలికితీసి వ్యాపారం చేస్తున్న పెద్ద సంస్థ అని అన్నారు. భూములు కోల్పోయిన నిర్వాసితులకు పరిహారం చెల్లించే విషయంలో లెక్కలు వేయడం ఏమిటని ప్రశ్నించారు. భూ నిర్వాసితులకు రావాల్సిన నష్టపరిహారం చెల్లించడంలో అధికారులు జాప్యం చేయడం సరికాదన్నారు.

నష్టపరిహారం కోసం బాధితులు అధికారుల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, తమ సొంత ఇళ్లలోనే ఉంటూ ఐక్యంగా హక్కుల కోసం పోరాటం చేయాలని సూచించారు. పరిహారం అందలేదని ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడాల్సిన అవసరం లేదని, బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలోకి వచ్చే వరకు మాత్రమే రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకుని తిరుగుతారని, అధికారం చేపట్టిన తర్వాత ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. సింగరేణి డీఎంఎఫ్‌టీ, సీఎస్‌ఆర్ నిధులను కూడా ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి సక్రమంగా వినియోగించడం లేదని ఆరోపించారు.

రాజాపూర్‌తో పాటు సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లోని భూ నిర్వాసితులందరికీ న్యాయమైన నష్టపరిహారం అందించే వరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బాధితులకు అండగా నిలిచి పోరాటం కొనసాగిస్తామని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి సంస్థ భూ నిర్వాసితులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI