Sircilla: గంభీరావుపేట-సిద్దిపేట మార్గంలో రాకపోకలు బంద్
Sircilla: ఎగువ మానేరు వరద ఉధృతితో గంభీరావుపేట-సిద్దిపేట మార్గంలో నిలిచిన రాకపోకలు. లింగన్నపేట వాగు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు, ఆర్టీసీ బస్సుల మళ్లింపు.
Sircilla: గంభీరావుపేట-సిద్దిపేట మార్గంలో రాకపోకలు బంద్
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా వరుసగా కురుస్తున్న భారీ వర్షాలతో ఎగువ మానేరు ప్రాజెక్టుకు వరద నీరు భారీగా చేరుతోంది. నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో మత్తడి దూకే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
ఎగువ మానేరు నీరు ప్రవహించే లింగన్నపేట వాగు వద్ద రాకపోకలను నిలిపివేశారు. కొత్త బ్రిడ్జి నిర్మాణం కోసం పాత వంతెనను తొలగించడంతో ప్రస్తుతం వాగు గుండా ప్రయాణాలు సాగుతున్నాయి. వరద ఉధృతి పెరిగితే ప్రయాణికులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయే ప్రమాదం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్ర చారి ఆదేశాల మేరకు ఎల్లారెడ్డిపేట సీఐ ఓదెల వెంకటేష్ ఆధ్వర్యంలో గంభీరావుపేట ఎస్సై శ్రీకాంత్ గంభీరావుపేట–సిద్దిపేట మార్గంలో భారీ కేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు. ప్రమాద నివారణ చర్యలను సీఐ వెంకటేష్ పరిశీలించారు. ఈ మార్గంలో ప్రయాణాలు నిలిపివేసి పోలీసులకు సహకరించాలని గంభీరావుపేట మండల తహసీల్దార్ మారుతిరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఆర్టీసీ బస్సుల రూట్ మళ్లింపు
పోలీసుల ఆదేశాల మేరకు ఆర్టీసీ అధికారులు కూడా బస్సుల రూట్లను మార్చారు. సిరిసిల్ల డిపో నుంచి బీబీపేటకు వెళ్లే నైట్ హాల్ట్ బస్సు గంభీరావుపేట వరకు వెళ్లి అక్కడి నుంచి కోరుట్లపేట, మల్లారెడ్డిపేట, లింగన్నపేట, కొత్తపల్లి, శ్రీగాధ, గోసానిపల్లి, ఆకారం, తుజ్జాల్పూర్, మల్కాపూర్ మీదుగా బీబీపేటకు వెళ్లనుంది. వరద ఉధృతి తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.




