Karimnagar: డప్పు చాటింపుతో దీక్షా దివస్ సభకు గంగుల కమలాకర్ ఆహ్వానం!

Karimnagar: నవంబర్ 29న అలుగునూరులో జరిగే దీక్షా దివస్ సభకు కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గురువారం డప్పు చాటింపుతో ఆహ్వానించారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 26 Nov 2026 6:18 PM IST
Karimnagar
X

Karimnagar: డప్పు చాటింపుతో దీక్షా దివస్ సభకు గంగుల కమలాకర్ ఆహ్వానం!

కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన దీక్షా దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతోంది. ఈ నెల 29న కరీంనగర్ జిల్లా అలుగునూరులో నిర్వహించనున్న దీక్షా దివస్ సభను విజయవంతం చేయాలని కోరుతూ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్‌లో డప్పు చాటింపు కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ నగర శాఖ అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరై స్వయంగా డప్పు కొట్టి ప్రజలకు సభకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తూ ఆహ్వానించారు.

ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడుతూ.. ఒకప్పుడు గ్రామాల్లో ఏదైనా శుభకార్యం నిర్వహించాలన్నా, ముఖ్యమైన సమావేశం ఏర్పాటు చేయాలన్నా, ప్రజలకు సమాచారం చేరవేయాలన్నా డప్పు చాటింపే ప్రధాన ప్రచార సాధనంగా ఉండేదన్నారు. గ్రామంలో డప్పు చాటింపు వినిపిస్తే ఏదో ముఖ్యమైన కార్యక్రమం జరుగుతుందని భావించి ప్రజలంతా తప్పనిసరిగా హాజరయ్యేవారని గుర్తుచేశారు. అదే సంప్రదాయాన్ని గుర్తుచేస్తూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్రలో కీలక ఘట్టమైన దీక్షా దివస్ సభకు ప్రజలను ఆహ్వానించేందుకు డప్పు చాటింపు చేపట్టినట్లు వివరించారు.

తెలంగాణ ఉద్యమానికి కీలక మలుపు..

2009 నవంబర్ 29 తెలంగాణ చరిత్రలో అత్యంత కీలకమైన రోజని గంగుల పేర్కొన్నారు. దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న వివక్ష, వెనుకబాటుతనం, దోపిడీకి చరమగీతం పాడాలనే సంకల్పంతో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పదవులు, రాజకీయ ప్రలోభాలను పక్కనపెట్టి ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఉద్యమాన్ని ముందుకు నడిపించారని అన్నారు. 2009 నవంబర్ 9న అలుగునూరు వద్ద కేసీఆర్‌ను అరెస్టు చేసినప్పటికీ ఉద్యమం ఆగలేదని, అరెస్టుతో తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమం మరింత ఉధృతమైందని గుర్తుచేశారు. ప్రజా ఉద్యమం, కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చే పరిస్థితి ఏర్పడిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆ దీక్ష చారిత్రక మలుపుగా నిలిచిందని పేర్కొన్నారు.

నాలుగు కోట్ల ప్రజల చారిత్రక కార్యక్రమం..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోయి ఉంటే నేడు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సాధ్యమయ్యేది కాదని గంగుల అన్నారు. దీక్షా దివస్ అనేది కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం కాదని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు సంబంధించిన చారిత్రక సందర్భమని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులు, ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులు, కవులు, మేధావులు, వారి కుటుంబాలను స్మరించుకుని గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

29న అలుగునూరులో భారీ సభ...

ఈ నెల 29న అలుగునూరులో నిర్వహించనున్న దీక్షా దివస్ సభకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని గంగుల వెల్లడించారు. మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభమవుతుందని, వేలాది మంది ప్రజలతో భారీ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులు, కవులు, మేధావులను ఘనంగా సన్మానించనున్నట్లు చెప్పారు.

కరీంనగర్ నగరంతో పాటు జిల్లాలోని అన్ని మండలాల్లో డప్పు చాటింపు ద్వారా ప్రజలకు సభ సమాచారాన్ని చేరవేస్తున్నట్లు తెలిపారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బీఆర్ఎస్ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తాయని పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమ చరిత్రను గుర్తుచేసే దీక్షా దివస్ సభను ప్రతి ఒక్కరూ తమ సొంత కార్యక్రమంగా భావించి పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN