Karimnagar: గన్నేరువరం డబుల్ రోడ్డు కోసం దీక్ష యువజన సంఘాల నాయకుల అరెస్ట్
Karimnagar: గన్నేరువరం డబుల్ రోడ్డు నిర్మాణం కోసం చేపట్టిన 24 గంటల దీక్షపై పోలీసుల ఉక్కుపాదం. పలువురు యువజన సంఘాల నాయకుల అరెస్ట్, మండలంలో ఉద్రిక్తత.
Karimnagar: గన్నేరువరం డబుల్ రోడ్డు కోసం దీక్ష యువజన సంఘాల నాయకుల అరెస్ట్
Karimnagar: గన్నేరువరం మండల కేంద్రం లో ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు ఉదయం 6:00 గంటల నుండి గన్నేరువరం మండల కేంద్రాన్ని అడుగడుగున బందోబస్తు ఏర్పాటు చేసి అదనపు బలగాలతో పర్యవేక్షించినప్పటికీ యువజన సంఘాల నాయకులు అనుకున్న సమయానికి గన్నేరువరం లోని వివేకానంద విగ్రహం వద్దకు చేరుకొని వారి పోరాట పటిమను నిరూపించుకున్నారు. ఒక్కసారిగా యువజన సంఘాలు దీక్ష ప్రదేశానికి చేరుకోగానే పోలీసులు వారిని చెదరగొట్టి బలవంతంగా పోలీసు వాహనాల్లోనికి ఎక్కించారు. ఈ క్రమంలో పోలీసులకు యువజన సంఘాల నాయకులకు పెనుగులాట జరిగింది పలువురు యువజన సంఘాల నాయకులకు గాయాలయ్యాయి. పోలీసులు బలవంతంగా యువజన సంఘాలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా యువజన సంఘాల అధ్యక్షుడు కాలువ నాగరాజు, మాజీ జెడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకుడు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, బిజెపి నియోజకవర్గ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి, బిఆర్ఎస్ యువజన నాయకుడు గూడూరి సురేష్ లు మాట్లాడుతూ ఎమ్మెల్యే రోడ్డు వేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడిచినప్పటికీ రోడ్డు వేయకపోగా రోడ్డు అని ప్రశ్నించిన వారిని బెదిరింపులకు గురి చేస్తూ పోలీసుల సహకారంతో అక్రమ కేసులు బనాయిస్తూ అణిచి వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
శాంతియుతంగా నిరాహార దీక్ష చేపడదామని పోలీస్ శాఖను అనుమతులు అడుగుతే అధికార బలంతో అనుమతులు రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. వెంటనే రోడ్డు పనులు ప్రారంభించకుంటే రాబోయే రోజుల్లో యువజన సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. యువజన సంఘాలు నిరాహార దీక్ష చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు దానికి పోటీగా అదే సమయానికి మాదకద్రవ్యాలపై చైతన్య ర్యాలీ నిర్వహించడం దానికి పోలీసుల మద్దతు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. యువజన సంఘాల నాయకులపై జరుగుతున్న అరాచకాన్ని గ్రామ ప్రజలు ఖండిస్తూ మద్దతుగా నిలిచారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువజన సంఘాల సభ్యులు వివిధ రాజకీయ పార్టీల మండల నాయకులు పాల్గొన్నారు.




