Sircilla: నాగుల మల్లయ్య ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం: విప్!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాగుల మల్లయ్య జయంతి వేడుకల్లో విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA
Published on: 4 Aug 2026 5:53 PM IST
Sircilla
X

Sircilla: నాగుల మల్లయ్య ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం: విప్!

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాగుల మల్లయ్య జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమాజంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం పోరాడిన నాగుల మల్లయ్య ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు.

అదే కార్యక్రమంలో ఇటీవల విశాఖపట్నంలో రాకెట్ సాంకేతిక రంగంలో సేవలందిస్తున్న జిల్లా యువ శాస్త్రవేత్తలు, యువ ఇంజనీర్లు సంతోష్ కుమార్, కిరణ్, నాగరాజులను ఘనంగా సన్మానించారు. విక్రమ్–1 వంటి అంతరిక్ష ప్రాజెక్టుల్లో జిల్లా యువత కీలక పాత్ర పోషించడం గర్వకారణమని కొనియాడారు.

నాగుల మల్లయ్య బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల హక్కుల కోసం పోరాడిన మహానాయకుడని, ఆయన ఆశయాలకు అనుగుణంగా సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. యువత మహనీయులను ఆదర్శంగా తీసుకుని ఉన్నత విద్యను అభ్యసించి దేశ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు.

ప్రపంచం గ్లోబల్ విలేజ్‌గా మారిన నేపథ్యంలో అంతరిక్ష సాంకేతికత దేశాభివృద్ధికి కీలకమని పేర్కొన్న ఆయన, జిల్లాకు చెందిన యువ ఇంజనీర్లు రాకెట్ నిర్మాణంలో భాగస్వాములు కావడం జిల్లాకు గర్వకారణమన్నారు. ఇలాంటి ప్రతిభావంతులను సన్మానించడం ద్వారా మరెందరో యువతకు స్ఫూర్తి లభిస్తుందని చెప్పారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాల వల్ల పేద విద్యార్థులు నేడు డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలుగా ఎదుగుతున్నారని తెలిపారు. పేదల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్య, ఉపాధి, సంక్షేమ రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రుద్రంగిలో రూ.42 కోట్లతో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ నిర్మాణం కూడా గ్రామీణ యువతకు ఆధునిక సాంకేతిక విద్య అందించాలనే సంకల్పానికి నిదర్శనమని పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని, నాగుల మల్లయ్య ఆశయాల సాధన దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని విప్ ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story