Peddapalli: పెద్దపల్లిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ!
Peddapalli: పెద్దపల్లిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేపట్టిన ప్రభుత్వ విప్ విజయరమణారావు, కలెక్టర్ కోయ శ్రీహర్ష. అర్హులందరికీ పథకాలు.
Peddapalli: పెద్దపల్లిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ!
Peddapalli: పేదలకు నాణ్యమైన సన్నబియ్యం అందించడంతో పాటు అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇచ్చేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు అన్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమైందని తెలిపారు. గతంలో పెద్ద పుస్తకం రూపంలో ఉండే రేషన్ కార్డును ఇప్పుడు సులభంగా వెంట తీసుకెళ్లే స్మార్ట్ కార్డుగా మార్చామన్నారు.
పెద్దపల్లి జిల్లాలో మొత్తం 2 లక్షల 46 వేల 157 కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు వివరించారు. 30 వేలకు పైగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామని, అర్హులైన ప్రతి కుటుంబానికి కార్డు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రేషన్ షాపుల ద్వారా పేదలకు నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్నామని అన్నారు. గతంలో రేషన్ బియ్యం రీసైక్లింగ్ జరిగేదని, ఇప్పుడు ప్రజలు నేరుగా సన్నబియ్యాన్ని ఆహారంగా వాడుకుంటున్నారని చెప్పారు.
ఈ పథకం దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలించవద్దని కోరారు. మార్కెట్‌లో కిలో 60 రూపాయలు ఉండే ఈ సన్నబియ్యాన్ని మన రైతుల నుంచే ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని, రైతులకు క్వింటాల్‌కు 500 రూపాయల బోనస్ ఇస్తోందని తెలిపారు.
పెద్దపల్లి నియోజకవర్గంలోనే 60 కోట్ల రూపాయల బోనస్ రైతులకు అందిందన్నారు.జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ.. స్మార్ట్ రేషన్ కార్డులను టి-రేషన్ యాప్‌కు అనుసంధానం చేస్తున్నామని, హోలోగ్రామ్, క్యూఆర్ కోడ్‌తో కార్డులు పారదర్శకంగా ఉంటాయని చెప్పారు.
అనంతరం కులాంతర వివాహాలు చేసుకున్న 116 జంటలకు 2 లక్షల 50 వేల రూపాయల చొప్పున ప్రోత్సాహక బాండ్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీరాములు, ఆర్డీవో గంగయ్య, జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.




