Karimnagar: పథకాలే లక్ష్యం.. ప్రజా పాలనే ధ్యేయం: ప్రగతి ప్రణాళిక సిద్ధం!
Karimnagar: కరీంనగర్ జిల్లాలో 99 రోజుల 'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక' కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయినట్లు కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు.
Karimnagar: పథకాలే లక్ష్యం.. ప్రజా పాలనే ధ్యేయం: ప్రగతి ప్రణాళిక సిద్ధం!
Karimnagar: ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి అందించడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం సమర్థవంతంగా జరిగిందని, క్షేత్రస్థాయిలో పర్యటించిన అధికారులు తమ దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి భవిష్యత్తు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా స్థాయి సభ జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొత్తం 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా 10 అంశాలతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అధికారులు ప్రతి గ్రామం పర్యటించి ప్రజలతో మమేకమయ్యారని, వారి సమస్యలు తెలుసుకున్నారని, అవసరాలను గుర్తించారని పేర్కొన్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో సభలు, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం వంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. కొత్తగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు శిక్షణ, సంక్షేమం, అవగాహన సదస్సులు వంటివి ఏర్పాటు చేశామని తెలిపారు. అధికారులు ప్రజా సమస్యలను తెలుసుకున్నారని, వాటి పరిష్కారానికి ప్రణాళికతో ముందుకు వెళ్తామని వివరించారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలతో పాటు, ప్రజా అవసరాలను గుర్తించామని తెలిపారు. ప్రతి చివరి లబ్ధిదారునికి ప్రభుత్వ పథకాలు చేరేవరకు తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు.
నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా పాలన కార్యక్రమంలో గుర్తించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు. అందుకు అవసరమైన నిధులు విడుదల చేయాలని కోరారు. గ్రామస్థాయిలో అభివృద్ధి పనులకునిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం అభివృద్ధిని ప్రోత్సహించాలని అన్నారు.
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయడం చైతన్య పరచడం, భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేయడం వంటి కార్యక్రమాల దృశ్య ప్రజా పాలన కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలో ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. అధికారులు ప్రజలతో మమేకమై అనేక సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించారని అన్నారు. మరిన్ని పెండింగ్ సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖలో ఉన్నతాధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటారని తెలిపారు.
పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా నియమాలు ట్రాఫిక్ నిబంధనలపై విస్తృత అవగాహన కల్పించామని అన్నారు. సుమారు 1500 మంది డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించి 500 మందికి కంటి అద్దాలు పంపిణీ చేసినట్లు తెలిపారు.
మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ మాట్లాడుతూ 66 డివిజన్లలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం ద్వారా సానిటేషన్ ని మెరుగుపరిచామని తెలిపారు. రానున్న రోజుల్లో కొత్తగా నగరంలో కలిసిన పరిసర ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెడతామని అన్నారు.
సర్పంచుల సమస్యల పరిష్కారానికి హెల్ప్ డెస్క్..
గ్రామాల్లో సర్పంచులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్న ఈ హెల్ప్ డేస్క్ నిర్వహణ కోసం హెల్ప్ లైన్ నెంబర్లను కేటాయించి సర్పంచులకు తెలియజేయాలని పేర్కొన్నారు.
క్షేత్రస్థాయిలో సందర్శించి అసంపూర్తిగా ఉన్న గ్రామ పంచాయతీ భవనాల జాబితాను సిద్ధం చేయాలని తెలిపారు. వాటిని పూర్తి చేయించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం అన్ని గ్రామ పంచాయతీల జమా ఖర్చులను పర్యవేక్షించాలని, తద్వారా సిబ్బంది వేతనాలు, గ్రామపంచాయతీ విద్యుత్ బిల్లులు వంటివి సకాలంలో చెల్లింపులు జరిగేలా చూడాలని అన్నారు.
ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ సునీల్ రావు, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాసరెడ్డి, ఆర్డీవోలు మహేశ్వర్, రమేష్ బాబు, మున్సిపల్ చైర్మన్లు మున్సిపల్ కమిషనర్లు, కార్పొరేటర్లు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.




