Peddapalli: పెద్దపల్లి హెచ్‌ఎం ఈర్ల సమ్మయ్యకు కలెక్టర్, ఎమ్మెల్యేల ఘన సన్మానం!
Peddapalli: పెద్దపల్లి జిల్లా ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎం ఈర్ల సమ్మయ్య ఎఫ్‌ఆర్‌ఎస్ (FRS) హాజరులో జిల్లా టాపర్‌గా నిలిచారు.
Peddapalli: పెద్దపల్లి హెచ్‌ఎం ఈర్ల సమ్మయ్యకు కలెక్టర్, ఎమ్మెల్యేల ఘన సన్మానం!
Peddapalli: ఆన్ లైన్ ముఖ గుర్తింపు వ్యవస్థ ( ఎఫ్ఆర్ఎస్ - ఫెషియల్ రికాగ్నిషన్ సిస్టం) లో జిల్లా టాపర్ గా నిలిచినందుకు గాను పెద్దపల్లి జిల్లా, శ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్యను ఆదివారం ఉదయం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరెట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, తెలంగాణ రాష్ట్ర విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామణారావులు ఘనంగా సన్మానించారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా 2025 -26 విద్యా సంవత్సరానికి గాను ఈర్ల సమ్మయ్య ఎఫ్ఆర్ఎస్ లో, పాఠశాల హాజరు శాతంలో పెద్దపల్లి జిల్లా స్థాయిలో టాపర్ గా నిలవడంతో ఆయనను జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు ప్రశంసా పత్రం, జ్ఞాపికను అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈర్ల సమ్మయ్య గత రెండేళ్లుగా ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా అంకితభావంతో పనిచేస్తూ, పాఠశాలలో అనేకమైన విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ప్రతిరోజు సకాలంలో పాఠశాలకు హాజరవుతూ పాఠశాల అభివృద్ధి, పిల్లల సర్వతో ముఖాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారు. పనిచేస్తున్న పాఠశాలకు దగ్గరలోనే నివాసం ఉంటూ, ప్రతిరోజు పాఠశాలలో అదనంగా రెండు గంటలు పని చేస్తూ పిల్లల్ని ఉన్నతులుగా, ఉత్తములుగా తీర్చిదిద్దుతున్నారు. తాను ఊషన్నపల్లి పాఠశాలకు వచ్చిన తర్వాత పాఠశాలలో బోర్ వేయించారు. దాతల సహకారంతో మినరల్ వాటర్ ప్లాంట్, ఫ్రిడ్జ్ ఏర్పాటు చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో రూ. 30.25 లక్షలతో రెండు అదనపు తరగతి గదులతో పాటు, ఒక వంట గదిని నిర్మించి పాఠశాలను అద్భుతంగా తయారు చేశారు.
పాఠశాల పిల్లలకు నిర్దేశించిన విద్యా ప్రమాణాల్లోనూ, ఎఫ్ఎల్ఎన్ లోనూ జిల్లాస్థాయిలో అద్భుత ఫలితాలు సాధించి, రెండుసార్లు (2024-25, 2025-26) 'జిల్లా ఛాంపియన్ స్కూల్ అవార్డు' అందుకున్నారు. పాఠశాలకు చెందిన ఇద్దరు పిల్లలు రాష్ట్రస్థాయి నీతి పద్యాల పోటీల్లో విజయం సాధించారు. ఆదర్శ, గురుకుల పాఠశాలల ప్రవేశ పరీక్షలో 13 మంది పిల్లలు అత్యంత ప్రతిభ కనబరిచి విజయం సాధించడం గొప్ప విషయంగా చెబుతున్నారు. పాఠశాలతో పాటు పిల్లల అభివృద్దే ధ్యేయంగా అహర్నిశలు కష్టపడి, అంకితభావంతో పనిచేస్తున్న ఈర్ల సమ్మయ్యను గ్రామస్తులు, మండల, జిల్లాలోని ప్రజలతోపాటు అధికారులు, ప్రజాప్రతినిధులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అభినందిస్తున్నారు. విద్యా రంగంలో ఈర్ల సమ్మయ్య చేస్తున్న అద్భుతమైన సేవలను కొనియాడుతున్నారు. ఒకే వేదికపై జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, డీఈవో ఇతర అధికారుల చేతుల మీదుగా సన్మానం పొందడం చాలా సంతోషంగా ఉందని ఈర్ల సమ్మయ్య తెలిపారు.




