Eligedu: రైతులు లాభదాయకమైన ఆయిల్ పామ్ వైపు మళ్లాలి.. ప్రభుత్వ విప్
Eligedu: పెద్దపల్లి జిల్లా ఎలిగేడులో ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ డ్రైవ్. తన 3 ఎకరాల పొలంలో మొక్కలు నాటి రైతులకు ఆదర్శంగా నిలిచిన విప్ విజయరమణారావు.
Eligedu: రైతులు లాభదాయకమైన ఆయిల్ పామ్ వైపు మళ్లాలి.. ప్రభుత్వ విప్
ఎలిగేడు: రైతులు సాంప్రదాయ పంటల నుంచి లాభదాయకమైన పంట మార్పిడి వైపు మళ్లాలని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలో ఉద్యానవన, పట్టు పరిశ్రమల శాఖల ఆధ్వర్యంలో 'ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ డ్రైవ్' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ప్రభుత్వ విప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విప్ విజయరమణారావు రైతులకు ఆదర్శంగా నిలిచేందుకు శివపల్లిలోని తన స్వంత 3 ఎకరాల పొలంలో ఆయిల్ పామ్ మొక్కలను నాటారు. ఈ డ్రైవ్‌లో భాగంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు మొత్తం 120 ఎకరాలలో ఆయిల్ పామ్ మొక్కలను నాటడం విశేషం.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ విజయరమణారావు మాట్లాడుతూ.. భవిష్యత్తులో వరి ధాన్యం దిగుబడి విపరీతంగా పెరిగి, కొనుగోళ్లు కష్టమయ్యే ప్రమాదం ఉందని, అందుకే రైతులు ఆయిల్ పామ్ వంటి ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని సూచించారు. తన తండ్రి, బాబాయ్ ల ప్రోత్సాహంతోనే తాను నేడు స్వయంగా ఆయిల్ పామ్ సాగుకు శ్రీకారం చుట్టానని తెలిపారు.
దేశంలో ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉందని, ప్రస్తుతం ముడి సరుకు కోసం విదేశాల నుంచి దిగుమతులపై ఆధారపడుతున్నామని, కాబట్టి రాబోయే 40 నుండి 50 సంవత్సరాల వరకు ఆయిల్ పామ్‌కు తిరుగులేని డిమాండ్ ఉంటుందని స్పష్టం చేశారు.
ఎకరానికి ₹2.5 లక్షల అదనపు ఆదాయం:
ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటగా క్యాడ్బరీ కంపెనీకి అవసరమయ్యే కోకో (క్యాడ్బరీ) మొక్కలను నాటవచ్చని విప్ తెలిపారు. చెట్లు 8 నుండి 10 ఫీట్ల ఎత్తు పెరిగిన తర్వాత వచ్చే నీడలో ఈ కోకో పంట అద్భుతంగా పండుతుందని, దీని ద్వారా ఎకరానికి అదనంగా ₹2,50,000 నుండి ₹3,000,000 వరకు నికర ఆదాయం లభిస్తుందని వివరించారు.
ఒకసారి ఆయిల్ పామ్ నాటితే 30 సంవత్సరాల పాటు నిరంతరాయంగా గెలల దిగుబడి వస్తుందని, ప్రస్తుతం టన్ను ధర సుమారు ₹23,000 ఉందన్నారు. ఐదో సంవత్సరంలో ఎకరానికి 5 టన్నుల దిగుబడితో (సుమారు ₹1.15 లక్షలు) ప్రారంభమై, ఆరు, ఏడో సంవత్సరానికి 8 నుండి 10 టన్నులు, ఆ తర్వాత గరిష్టంగా 14 నుండి 15 టన్నుల వరకు దిగుబడి వస్తుందని లెక్కలతో వివరించారు.
రైతులు సమయానికి ఎరువులు, సేంద్రీయ ఎరువులు వేస్తూ సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అద్భుతమైన లాభాలు సాధించవచ్చని, ప్రభుత్వం రైతులకు అవసరమైన అన్ని ఎరువులు, సదుపాయాలను అందిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.




