Odela Mallanna: ఓదెల ఆలయ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ!

Odela Mallanna: పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధికి రూ. 1.35 కోట్లు మంజూరు చేసినట్లు ప్రభుత్వ విప్ విజయ రమణారావు తెలిపారు.

Srimanthula Kondal, Peddapalli
Published on: 5 May 2026 5:10 PM IST
Odela Mallanna
X

Odela Mallanna: ఓదెల ఆలయ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ!

Odela Mallanna: ప్రజలందరి ఇంటి ఇలవేల్పు అయిన ఓదెల లోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో అభివృద్ధి పనులకు రూ. 1 కోటి 35 లక్షల మంజూరు చేయించినట్టు ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు తెలిపారు.

ఇట్టి నిధులను మంజూరు చేసిన ఎమ్మెల్యే విజయ రమణారావు ని ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలోని ఆయన నివాసంలో ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ పాలక మండలి చైర్మన్ చీకట్ల మొండయ్య ఆధ్వర్యంలో పాలకవర్గం, ఈఓ సదయ్య, అర్చకులు, సిబ్బంది మంగళవారం ఘనంగా సన్మానించారు. అలాగే, ఆలయ అర్చకులు విజయ రమణారావు, పావని దంపతులను, వారి కుటుంబ సభ్యులకు ఆశీర్వచనములు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధికి ఒక ప్రణాళిక బద్ధంగా ముందుకు పోతున్నామని అందులో భాగంగానే రూ. 1 కోటితో ఆలయ ఆవరణ లోపలి భాగంలో సిసి రోడ్ల నిర్మాణం, రూ.15 లక్షలతో టాయిలెట్స్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. అనంతరం 20 లక్షలతో లైటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని వీటికి సంబంధించిన పనులను త్వరలో చేపడతామని అన్నారు. జూన్ మాసం లోగా పూర్తి చేస్తామన్నారు.

పెద్దపల్లి జిల్లాలోని ప్రధాన ఆలయంగా పేరుగాంచిన ఓదెల మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధిని దృష్టిపెట్టుకొని నేను గెలిచాక ఆలయ మార్గంలో డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టి సెంట్రల్ లైటింగ్ సిస్టంను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఓదెల మండల కేంద్రంతో అనుసంధానంగా ఉన్న వివిధ గ్రామాల రోడ్లను ఆధునికరిస్తున్నట్టు తెలిపారు. గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని గోదావరి పరివాహక ప్రాంతంలోని దేవాలయాలను ప్రభుత్వం అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేయడం జరిగిందని,

అయితే ఓదెల ఆలయం గోదావరి పరివాహక ప్రాంతంలో లేనందున ప్రత్యేక ప్యాకేజీ కింద అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభ్యర్థించినట్లు తెలిపారు. ఇందుకోసం సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఆలయ పాలకమండలి ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం కొత్తగా దాతల సహకారంతో 21 వసతి గదులను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని తెలిపారు.

రానున్న రోజుల్లో ఓదెల ఆలయ అభివృద్ధికి మరింత కట్టుబడి ఉన్నామని విజయ రమణారావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి చైర్మన్ చీకట్ల మొండయ్య, ఆలయ ఈవో సదయ్య,డైరెక్టర్లు కట్కూరి సమ్మిరెడ్డి, ఉప్పుల శ్రావణ్ కుమార్, జీలుక రవీందర్, కొండ శ్రీనివాస్, తీర్థాల రాజారాం, తాళ్లపల్లి శ్రీనివాస్, ఈరవేన రవికుమార్, గంట రమేష్, సామల యమునా హరికృష్ణ, కోదాటి మనోహర్రావు, జంగ కొమురయ్య , ప్రధాన అర్చకులు వీరభద్రయ్య, అర్చకులు అభిషేక్, సిబ్బంది కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli

Next Story