Peddapalli: వరి సాగు వద్దు.. ఆయిల్ పామ్ ముద్దు!

Peddapalli: పెద్దపల్లి జిల్లా ఎలిగేడులో జరిగిన రైతు వారోత్సవాల్లో ప్రభుత్వ విప్ విజయ రమణారావు మరియు కలెక్టర్ కోయ శ్రీ హర్ష పాల్గొన్నారు.

Srimanthula Kondal, Peddapalli
Published on: 5 May 2026 5:48 PM IST
Peddapalli
X

Peddapalli: వరి సాగు వద్దు.. ఆయిల్ పామ్ ముద్దు!

Peddapalli: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఎలిగేడు మండలంలో మంగళవారం నిర్వహించిన రైతు వారోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చింతకుంట విజయరామణరావు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ చింతకుంట విజయరామణరావు మాట్లాడుతూ తన చిన్ననాటి రోజుల్లో ఎలిగేడు మండలంలో కాలువ నీరు అందుబాటులో లేకపోయేదని గుర్తుచేశారు. అనంతరం జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ నాయకత్వంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణం జరిగి కాలువల ద్వారా రైతులకు నీరు అందించబడిందన్నారు. మొదటి దశలో అప్పటి కరీంనగర్ జిల్లాలో 5.4 లక్షల ఎకరాలకు నీరు అందించగా, అందులో 1.4 లక్షల ఎకరాలు పెద్దపల్లిలోనే ఉన్నాయని తెలిపారు.

2014 తర్వాత శ్రీరాంసాగర్ కాలువలను నిర్లక్ష్యం చేసి ఇతర ప్రాజెక్టులపై దృష్టి సారించడం వల్ల ఈ ప్రాంత రైతులకు నష్టం జరిగిందని విమర్శించారు. గతంలో పెసర్లు, జొన్నలు, కందులు వంటి పంటలు పండించిన రైతులు ఇప్పుడు ఎక్కువగా వరి పంటపైనే ఆధారపడుతున్నారని పేర్కొన్నారు. ఇది రైతులకు లాభదాయకం కాదని, పంట మార్పిడి చేపట్టి మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని సూచించారు.

రైతులు ఆయిల్ పామ్ వంటి లాభదాయక పంటలను సాగు చేయాలని, భూమి సారాన్ని కాపాడేందుకు యూరియా వినియోగాన్ని తగ్గించాలని, పంట అవశేషాలను కాల్చడం మానుకోవాలని సూచించారు. మన నియోజకవర్గంలో కొంతమంది రైతులు ఎకరానికి రూ.1 లక్ష నుండి రూ.1.5 లక్షల వరకు ఆదాయం పొందుతున్నారని తెలిపారు. వచ్చే ఏడాది ఎలిగేడు మండలంలో కనీసం వెయ్యి ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా పెట్టుకొని అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ ప్రభుత్వం రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. ఆయిల్ పామ్ సాగులో అంతర్ పంటల ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని, మొదటి నాలుగేళ్లపాటు ఎకరానికి సుమారు రూ.52 వేల వరకు సబ్సిడీ అందిస్తున్నామని పేర్కొన్నారు.

అంతర్ పంటలు పూర్తి మద్దతు ఉంటుందని, ఐదేళ్ల క్రితం రూ.14 వేలుగా ఉన్న ఆయిల్ పామ్ ధర ప్రస్తుతం రూ.23 వేల వరకు పెరిగిందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ధరలు పెరుగుతాయని, దేశంలో నూనెలకు దిగుమతులపై ఆధారపడుతున్నందున ఆయిల్ పామ్‌కు మంచి మార్కెట్ ఉందన్నారు. శ్రీరాంపూర్ ప్రాంతంలో కొత్త ఫ్యాక్టరీ రాబోతుండడంతో మార్కెటింగ్ సమస్యలు ఉండవని తెలిపారు.

పెద్దపల్లి జిల్లా రైతులు సంపన్న రైతులుగా పేరొందినందున ఆయిల్ పామ్ సాగును విస్తరించాలని సూచించారు. అదే విధంగా వరి సాగు రోజురోజుకీ పెరుగుతున్నదని, నాలుగేళ్లతో పోలిస్తే ప్రస్తుతం రోజుకు ఏడు రెట్లు ఎక్కువ వరి కొనుగోలు చేస్తున్నప్పటికీ ఇంకా అధికంగా మార్కెట్‌కు వస్తున్నదని తెలిపారు. అధిక ఉత్పత్తి రైతులకు లాభదాయకం కాదని హెచ్చరించారు.

వడగండ్ల వానలు పెరుగుతున్న నేపథ్యంలో పంట నష్టాలను తగ్గించేందుకు రబీ సీజన్‌ను 7 నుంచి 10 రోజులు ముందుకు మార్చేలా రైతులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి,జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్, తహసిల్దార్ యాకన్న ,ప్రజాప్రతినిధులు, రైతులు , తదితరులు,పాల్గొన్నారు.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli

Next Story