Peddapalli: జఫర్ ఖాన్ పేటలో విప్ విజయ రమణారావు విస్తృత పర్యటన!

Peddapalli: జఫర్ ఖాన్ పేటలో రూ.5.43 కోట్ల మద్దెల వాగు బ్రిడ్జి, బస్సు సర్వీసును ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రారంభించారు.

Srimanthula Kondal, Peddapalli
Updated on: 13 Aug 2026 2:29 PM IST
Peddapalli
X

Peddapalli: జఫర్ ఖాన్ పేటలో విప్ విజయ రమణారావు విస్తృత పర్యటన!

Peddapalli: కాల్వ శ్రీరాంపూర్ మండలం జఫర్ ఖాన్ పేట గ్రామంలో ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు విస్తృతంగా పర్యటించారు. గ్రామానికి విచ్చేసిన ఆయనకు సర్పంచ్ యాదగిరి జోత్స్న శ్రీనివాస్ పుష్పగుచ్ఛం, శాలువాతో ఘన స్వాగతం పలికి సన్మానించారు.

అనంతరం గ్రామంలో రూ. 5.43 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన మద్దెల వాగు హై లెవెల్ బ్రిడ్జిని, గోదావరిఖని – జఫర్ ఖాన్ పేట – పెద్దపల్లి ఆర్టీసీ బస్సు సర్వీసును ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం గ్రామంలో పలుసీ సీ రోడ్లను వారు ప్రారంభించారు.

​ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ గతంలో గడప గడపకు తిరిగినప్పుడు రోడ్లు లేక, స్కూల్ భవనాలు శిథిలావస్థలో ఉండి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు.

ఈ రోజు లక్షల రూపాయల నిధులతో పాఠశాల పునర్నిర్మాణం, కాంపౌండ్ వాల్ నిర్మాణంతో పాటు ఇండ్ల సంఖ్యతో సంబంధం లేకుండా గ్రామంలోని వీధులన్నింటికీ సిసి రోడ్లు పూర్తి చేశామన్నారు. రూ. 5.43 కోట్లతో మద్దెల వాగు బ్రిడ్జి పూర్తి చేయడమే కాకుండా, అప్రోచ్ రోడ్లకు అదనంగా మరో కోటి రూపాయలు ఖర్చు చేసి రవాణా కష్టాలను తీర్చామని తెలిపారు.

​నియోజకవర్గానికి రహదారుల మహర్దశ

ముత్తారం, మంథని వెళ్లే ప్రయాణికుల చిరకాల వాంఛను తీరుస్తూ మంగపేట కూనారం టర్నింగ్ నుండి ముత్తారం వరకు రూ. 32 కోట్లతో డబుల్ రోడ్డు మంజూరు చేయించామని ఎమ్మెల్యే వెల్లడించారు. అలాగే పెద్దపల్లి – గర్రెపల్లి మేజర్ రోడ్డుకు రూ. 100 కోట్లు, సుల్తానాబాద్ – పెద్దపూర్ రోడ్డుకు రూ. 47 కోట్లు, కూనారం – పెద్దపల్లి రోడ్డుకు రూ. 14 కోట్లు, జఫర్ ఖాన్ పేట్ రింగ్ రోడ్డుకు రూ. 7 కోట్లు, శ్రీరాంపూర్ హెడ్ క్వార్టర్ సెంట్రల్ లైటింగ్‌కు రూ. 5.5 కోట్లు నిధులు మంజూరయ్యాయని తెలిపారు.

​ఆగస్టు 17న శంకుస్థాపనల ఉత్సవం

ఈ అభివృద్ధి పనులన్నింటికీ ఆగస్టు 17న సుల్తానాబాద్‌ పర్యటనలో భాగంగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి జఫర్ ఖాన్ పేటతో పాటు శ్రీరాంపూర్ మండల ప్రజలు, నాయకులు, సోదరీమణులు ఉదయం 10 గంటలకు పెద్ద ఎత్తున సుల్తానాబాద్ తరలివచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

​వర్షాలతో చెరువులు నిండడం శుభపరిణామం

ప్రతిపక్షాలు వర్షాలు పడకూడదని, పంటలు ఎండిపోవాలని దొంగ ఏడుపులు ఏడ్చినా... దేవుడి దయతో వర్షాలు సమృద్ధిగా కురిసి శ్రీరాంపూర్ మండలంలోని చెరువులన్నీ మత్తళ్లు దుముకుతున్నాయని ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు.

ప్రస్తుత వాతావరణం పత్తి, వరి పంటలకు ఎంతో అనుకూలంగా ఉందని, ఈసారి ఎకరాకు 15 క్వింటాళ్లకు తగ్గకుండా పత్తి దిగుబడి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామీణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli

Next Story