Peddapalli: అంగన్‌వాడీలో సందడి.. పట్టాలు అందుకున్న బుజ్జాయిలు!
Peddapalli: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం ఇదిలాపూర్ అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు.
Peddapalli: అంగన్‌వాడీలో సందడి.. పట్టాలు అందుకున్న బుజ్జాయిలు!
పెద్దపల్లి జిల్లా: కాల్వశ్రీరాంపూర్, మండలంలోని ఇదిలాపూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం అంగన్వాడి టీచర్ సిద్ధం శారద ఆధ్వర్యంలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సర్పంచ్ మామిడి లత హాజరయ్యారు.ఈ సందర్భంగా చిన్నారులు గ్రాడ్యుయేషన్ గౌన్స్, టోపీలు, పట్టాలు సర్పంచ్ మామిడి లత చేతుల మీదుగా అందుకోవడం ఆకర్షణగా నిలిచింది.చిన్నారి విద్యార్థులు గ్రాడ్యుయేషన్ గౌన్లు, టోపీలు ధరించి పట్టాలు అందుకుంటున్న సమయంలో వారి ముఖాల్లో కనిపించిన ఆనందం చూసి తల్లిదండ్రులు మురిసిపోయారు. ఈ వేడుకను అంగన్వాడి టీచర్ సిద్ధం శారద ఎంతో వైభవంగా నిర్వహించడం పట్ల సర్పంచ్ మరియు గ్రామస్థులు ఆమెను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మామిడి లత మాట్లాడుతూ.. చిన్నారి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు అంగన్వాడీ కేంద్రాలే తొలి మెట్టు అని కొనియాడారు. అంగన్వాడీల్లో లభించే పూర్వ ప్రాథమిక విద్య పిల్లల మేధో వికాసానికి ఎంతో దోహదపడుతుందని, ఆటపాటలతో కూడిన ఈ విద్యా విధానం వారిలో నేర్చుకోవాలనే ఆసక్తిని పెంచుతుందని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుంటూ, పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తూ వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాల కృషి అభినందనీయమన్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న పిల్లలను నేరుగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించి, ఉన్నత చదువులకు ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, చిన్నారి విద్యార్థుల తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




