Dubai: దుబాయ్ విల్లా నోవాలో వైభవంగా బతుకమ్మ సంబరాలు!

Dubai: దుబాయ్‌లోని విల్లా నోవా కమ్యూనిటీలో తెలంగాణ ప్రవాసులు బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. వ్యాపారవేత్త గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా సాగాయి.

CH Gopalakrishna, Regional Coordinator -Karimnagar
Published on: 17 Oct 2026 9:57 AM IST
Dubai
X

Dubai: దుబాయ్ విల్లా నోవాలో వైభవంగా బతుకమ్మ సంబరాలు!

Dubai: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (యూఏఈ)లోని తెలంగాణ ప్రవాసుల సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా దుబాయ్‌లోని విల్లా నోవా కమ్యూనిటీలో బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి. ప్రముఖ వ్యాపారవేత్త గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో తెలంగాణ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంప్రదాయబద్ధంగా బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, గౌరీదేవికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. సంప్రదాయ బతుకమ్మ పాటలు, కోలాటాలు, నృత్యాలతో వేడుకల ప్రాంగణం సందడిగా మారింది.

తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతిని ఆరాధించే సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను విదేశీ గడ్డపై సైతం సంప్రదాయబద్ధంగా నిర్వహించడం విశేషంగా నిలిచింది. పూలతో అలంకరించిన బతుకమ్మల చుట్టూ మహిళలు చేరి, చప్పట్లు కొడుతూ లయబద్ధంగా పాటలు పాడారు. *‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో..’* అంటూ ఆలపించిన సంప్రదాయ గీతాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళల కోలాటాలు, ఉత్సాహభరితమైన నృత్యాలు, పండుగ వాతావరణంతో విల్లా నోవా కమ్యూనిటీ కళకళలాడింది.

ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. యూఏఈలో నివసిస్తున్న తెలంగాణ ప్రజల ఐక్యతను మరింత బలోపేతం చేయడం, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ తెలంగాణ పండుగలు, ఆచార వ్యవహారాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ముఖ్యంగా యూఏఈలో పుట్టి పెరుగుతున్న పిల్లలకు తెలంగాణ సంస్కృతి, చరిత్ర, సంప్రదాయాల గొప్పతనాన్ని పరిచయం చేయడంలో ఇటువంటి వేడుకలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, రాధాకృష్ణ, అశోక్ రెడ్డి, భగవాన్ రెడ్డితో పాటు విల్లా నోవా కమ్యూనిటీ సభ్యులు పాల్గొన్నారు. మహిళలు, కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొనడంతో బతుకమ్మ సంబరాలు సంప్రదాయబద్ధంగా, ఆహ్లాదకర వాతావరణంలో ముగిశాయి.

CH Gopalakrishna, Regional Coordinator -Karimnagar

CH Gopalakrishna, Regional Coordinator -Karimnagar

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, కరీంనగర్ ఉమ్మడి జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై అపారమైన పట్టున్న సీనియర్ పాత్రికేయులు మరియు ‘రీజినల్ కోఆర్డినేటర్’.