Sircilla: సిరిసిల్లలో ఘనంగా వినాయక నిమజ్జన వేడుకలు!

Sircilla: సిరిసిల్ల గాంధీ చౌక్‌లో హిందూ ఉత్సవ సమితి నిర్వహించిన వినాయక నిమజ్జన కార్యక్రమంలో ఎస్పీ మహేష్ బి. గితే, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA
Published on: 25 Sept 2026 9:47 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్లలో ఘనంగా వినాయక నిమజ్జన వేడుకలు!

సిరిసిల్ల: సిరిసిల్ల గాంధీ చౌక్‌లో వినాయక నిమజ్జన మహోత్సవాన్ని పురస్కరించుకుని హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి, మున్సిపల్ కమిషనర్ ఖాదర్ పాషా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే భక్తులు, నిర్వాహకులకు సందేశం అందించారు. అనంతరం మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ.. వినాయక చవితి నుంచి నేటి వరకు వినాయక ఉత్సవాలను ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన మండప నిర్వాహకులు, యువకులు, భక్తులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

వినాయక నిమజ్జన మహోత్సవంలో భక్తులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ ఆధ్వర్యంలో దాదాపు రూ.20 లక్షల నిధులతో మానేరు నది తీరంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. బారికేడ్లు, లైటింగ్, భారీ క్రేన్లు, పారిశుధ్య నిర్వహణ, తాగునీరు, సీసీ కెమెరాలతో పాటు నిరంతర పర్యవేక్షణ కోసం అధికారులను నియమించినట్లు వెల్లడించారు.

పోలీస్, ఆరోగ్య, రెవెన్యూ, విద్యుత్ తదితర శాఖల అధికారులు, సిబ్బంది కూడా నిమజ్జన కార్యక్రమంలో సేవలు అందిస్తున్నారని తెలిపారు. వినాయక మండపాల నిర్వాహకులు, భక్తులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణంలో శోభాయాత్ర నిర్వహించి వినాయకుడిని గంగమ్మ ఒడికి చేర్చాలని పిలుపునిచ్చారు.

సిరిసిల్లలో గత 36 సంవత్సరాలుగా వినాయక నిమజ్జన మహోత్సవాల సందర్భంగా మండప నిర్వాహకులను అభినందిస్తూ, ఆది పూజ్యుడు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ కార్యక్రమాన్ని ప్రశాంతంగా పూర్తి చేయడంలో హిందూ ఉత్సవ సమితి కీలక పాత్ర పోషిస్తోందని జిందం కళ చక్రపాణి పేర్కొన్నారు. ఈ ఏడాది కూడా చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు చేపూరి శ్రీనివాస్‌తో పాటు కార్యవర్గ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆది పూజ్యుడు వినాయకుడి చల్లని దీవెనలు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA