Karimnagar: 'గ్రీన్ కరీంనగర్' పోస్టర్ ఆవిష్కరణ.. కలెక్టర్ చిత్రా మిశ్రా!
Karimnagar: పచ్చదనం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ట్రాన్స్‌జెండర్ల ఆధ్వర్యంలో 'గ్రీన్ కరీంనగర్'. పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా.
Karimnagar: 'గ్రీన్ కరీంనగర్' పోస్టర్ ఆవిష్కరణ.. కలెక్టర్ చిత్రా మిశ్రా!
Karimnagar: పచ్చదనం పెంపు, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ట్రాన్స్‌జెండర్ల ఆధ్వర్యంలో ‘గ్రీన్ కరీంనగర్’ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. ఈ కార్యక్రమం రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచేలా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ట్రాన్స్‌జెండర్లు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని తమకు లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా ఎదగాలని సూచించారు.
కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ట్రాన్స్‌జెండర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టనున్న ‘గ్రీన్ కరీంనగర్’ కార్యక్రమం పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. రాష్ట్ర ట్రాంజెండర్స్ అసోసియేషన్ అడ్వైజర్ ఈవీ శ్రీనివాసరావు నేతృత్వంలో, జిల్లా అధ్యక్షురాలు ఆశ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. రెడ్‌క్రాస్ సొసైటీలో సభ్యత్వం పొందిన ట్రాన్స్‌జెండర్లకు కలెక్టర్ ఈ సందర్భంగా గుర్తింపు కార్డులను అందజేశారు.
సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి..
కలెక్టర్ మాట్లాడుతూ ట్రాన్స్‌జెండర్లలో చాలామంది విద్యావంతులు, వివిధ రంగాల్లో నైపుణ్యం కలిగినవారు ఉన్నారని తెలిపారు. తమ ప్రతిభకు తగిన అవకాశాలను అందిపుచ్చుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచించారు. సమాజంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు పొందేందుకు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని అన్నారు.
‘గ్రీన్ కరీంనగర్’కు శాఖల సహకారం...
ఆదర్శ్ హెల్పింగ్ హ్యాండ్స్, రెడ్‌క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ‘గ్రీన్ కరీంనగర్’ కార్యక్రమాన్ని నిర్వహించాలనే నిర్ణయం మంచి పరిణామమని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో పచ్చదనం పెంపు, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ కోసం ట్రాన్స్‌జెండర్లు వాలంటీర్లుగా పనిచేయడం స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు మున్సిపల్, అటవీ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులతో త్వరలో సమావేశం నిర్వహించి అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.
అర్హులైన ట్రాన్స్‌జెండర్లకు రేషన్ కార్డులతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ పథకాలు, అందుబాటులోకి వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రాంజెండర్స్ అసోసియేషన్ అడ్వైజర్ ఈవీ శ్రీనివాసరావు, ఆదర్శ్ హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షురాలు ఆశ, ట్రాన్స్‌జెండర్ల ప్రతినిధులు సింధు, రోహణ, వైష్ణవి, పూజ తదితరులు పాల్గొన్నారు.




