శాతవాహన విశ్వవిద్యాలయంలో 'హెల్త్ అవేర్నెస్' ప్రోగ్రాం విజయవంతం
Satavahana University: కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయంలో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరిశుభ్రతపై అవగాహన సదస్సు.
శాతవాహన విశ్వవిద్యాలయంలో 'హెల్త్ అవేర్నెస్' ప్రోగ్రాం విజయవంతం
Satavahana University: శాతవాహన విశ్వవిద్యాలయంలో డా. బి.ఆర్. అంబేడ్కర్ లైబ్రరీ ఆడిటోరియం లో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో "హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రాం ఆన్ హైజిన్" కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ ఆచార్య సతీష్ కుమార్ మాట్లాడుతూ పరిశుభ్రత పాటించడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని, వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా ఎంతో ముఖ్యమని వివరించారు.
ఈ కార్యక్రమానికి ఉపకులపతి ఆచార్య యు. ఉమేష్ కుమార్ విశిష్ట అతిథిగా విచ్చేసి వ్యక్తిగత పరిశుభ్రత, ఆహార ప్రాముఖ్యత, ఆరోగ్యకరమైన జీవనశైలి, వ్యాధుల నివారణ వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలని విశ్వవిద్యాలయంలో క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం కూడా నిర్వహించాలన్నారు.
ప్రతిమా ఫౌండేషన్ ఫౌండర్ & డైరెక్టర్ డా. బోయినపల్లి హరిణి మాట్లాడుతూ విశ్వవిద్యాలయ విద్యార్థులు తమ చదువుతోపాటు ఆరోగ్యాన్ని కూడా క్రమశిక్షణగా ఉంచుకోవాలని, యువత తమ శరీరంలో ముందస్తుగా వచ్చే అనేక వ్యాధులపై అవగాహన కల్పించుకొని ఆరోగ్యకరమైన జీవితం గడపడానికి ప్రయత్నం చేయాలని, మన తోటి వారికి అవగాహన కల్పించాలని తెలియజేస్తూ ప్రతిమ ఫౌండేషన్ తరపున వాడిన శానిటరీ పాడ్ల,వ్యర్దాలని నాశనం చేసే ఇన్సినిరేటర్ యంత్రాలను బహుకరించారు.
ముఖ్య అతిధిగా విచ్చేసిన డేర్మాటలోజిస్ట్ ఆచార్య గీతా రెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యాలయ యువత తమ ఆరోగ్యం పట్ల అవగాహనతో పాటు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని జంక్ ఫుడ్ ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దని మానసిక ఆరోగ్యం కోసం శారీరక ఆరోగ్యాన్ని పెంచుకోవాలని మహిళలు తమ ఆరోగ్యం పట్ల శరీరంలో వచ్చే మార్పుల పట్ల జాగ్రత్తతో ఉండాలని మనం తినే ఆహార పదార్థాల వల్లనే శరీరంలో క్యాన్సర్ కారకాలు ఉత్పన్నమవుతున్నాయని, బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కల్పించారు.
డా. సత్య ప్రభ, గైనకాలజీ విభాగాధిపతి మాట్లాడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యువత జాగ్రత్తలు తీసుకోవాలని, మంచి ఆరోగ్య అలవాట్లు జీవితాన్ని ఆనందమయం చేస్తాయని సూచించారు. కన్వీనర్ చీఫ్ వార్డెన్ డా. నజిముద్దీన్ మునవర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం విశ్వవిద్యాలయ విద్యార్థులకు ఆరోగ్య అవగాహన పెంపొందించడానికి దోహదపడిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్ట్స్, న్యాయ కళాశాల ప్రిన్సిపల్ డా.పద్మావతి, డా.నమ్రత, డా.జయంతి, సావిత్రి, అధ్యాపకులు, సైన్స్, ఆర్ట్స్, కామర్స్, న్యాయ కళాశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.




