Huzurabad: వైద్యుల కొరతతో వెలవెలబోతున్న హుజురాబాద్ ఏరియా ఆసుపత్రి
Huzurabad: హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో వైద్యుల కొరత కారణంగా రోగుల సంఖ్య తగ్గి, బెడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి వైద్యులను నియమించాలని కోరుతున్నారు.
Huzurabad: వైద్యుల కొరతతో వెలవెలబోతున్న హుజురాబాద్ ఏరియా ఆసుపత్రి
హుజురాబాద్: ఒకప్పుడు రోగులతో కిటకిటలాడిన హుజురాబాద్ ఏరియా ఆసుపత్రి నేడు వెలవెలబోతోంది. గతంలో బెడ్లు దొరకక రోగులు ఇబ్బందులు పడిన ఈ ఆసుపత్రిలో ప్రస్తుతం బెడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్న పరిస్థితి నెలకొంది. వైద్యుల కొరతతో ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య తగ్గిపోవడం, వైద్య సేవలు ఆశించిన స్థాయిలో అందకపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేశారు. దీంతో హుజురాబాద్ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని, అత్యవసర చికిత్సలతో పాటు శస్త్రచికిత్సలు కూడా స్థానికంగానే అందుబాటులోకి వస్తాయని ప్రజలు ఆశించారు.
గతంలో హుజురాబాద్ నియోజకవర్గంలోని వివిధ మండలాలతో పాటు పొరుగున ఉన్న జిల్లాల నుంచి సైతం రోగులు ఈ ఆసుపత్రికి వచ్చి చికిత్సలు, ఆపరేషన్లు చేయించుకొని వెళ్లేవారు. నిత్యం రోగులతో ఆసుపత్రి ప్రాంగణం సందడిగా ఉండేది. కానీ ప్రస్తుతం వైద్యుల కొరత కారణంగా ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
భవనాల అభివృద్ధి జరిగితే సరిపోతుందా? వైద్యులు లేకపోతే ప్రజలకు ప్రయోజనం ఏమిటి?
ఆసుపత్రి పడకల సంఖ్య పెంచడం, భవనాలను అభివృద్ధి చేయడం ఒకవైపు.. ప్రజలకు పూర్తిస్థాయి వైద్య సేవలు అందించడం మరోవైపు. వైద్యులు, నిపుణులు అందుబాటులో లేకపోతే కోట్లాది రూపాయలతో నిర్మించిన ఆసుపత్రి భవనాలు, పడకలు ప్రజలకు ఏ మేరకు ఉపయోగపడతాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
వైద్యుల నియామకాలపై ప్రభుత్వం దృష్టి సారించాలి
హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో వైద్యుల కొరతను తక్షణమే పరిష్కరించి, పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. ఒకప్పుడు రోగులతో కళకళలాడిన ఆసుపత్రి తిరిగి పూర్వ వైభవం సంతరించుకోవాలంటే వైద్యుల నియామకాలు, అవసరమైన వైద్య సిబ్బంది అందుబాటులో ఉండటం అత్యవసరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ సమస్యపై స్పందించి హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిని ప్రజలకు నిజమైన ఆరోగ్య సేవల కేంద్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది.




