Huzurabad: తెలంగాణ డీజీపీకి హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ విజ్ఞప్తి!

Huzurabad: ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో హోంగార్డులకు జరిగిన అన్యాయ బదిలీలను తక్షణమే రద్దు చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ డీజీపీకి విజ్ఞప్తి చేశారు.

GANESH, JAMMIKUNTA
Published on: 1 July 2026 8:39 AM IST
Huzurabad
X

Huzurabad: తెలంగాణ డీజీపీకి హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ విజ్ఞప్తి!

Huzurabad: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్, నియోజకవర్గం రాష్ట్రంలో ప్రజల భద్రత కోసం రాత్రింబవళ్లు సేవలందిస్తున్న హోంగార్డులను అన్యాయంగా ఇబ్బందులకు గురిచేయడం సరికాదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. తెలంగాణ డీజీపీ వెంటనే జోక్యం చేసుకుని హోంగార్డుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి వారికి న్యాయం చేయాలని కోరారు.

రాష్ట్రంలో సుమారు 16 వేల మంది, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుమారు 1,100 మంది హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. స్వల్ప వేతనంతో కుటుంబాలను పోషిస్తున్న హోంగార్డులను వందల కిలోమీటర్ల దూరాలకు బదిలీ చేయడం వల్ల వారు తీవ్ర ఆర్థిక, కుటుంబ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.హుజూరాబాద్, వేములవాడ, మంథని, సిరిసిల్ల తదితర ప్రాంతాల మధ్య హోంగార్డులను తరచూ బదిలీ చేయడం వల్ల వారి జీవనం భారంగా మారిందన్నారు.

నెలకు సుమారు రూ.30 వేల వేతనం పొందే హోంగార్డులు ప్రతిరోజూ దూరప్రాంతాలకు ప్రయాణించడం సాధ్యంకాదని పేర్కొన్నారు. మానవీయ కోణంలో ఆలోచించి ఈ బదిలీలను వెంటనే పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు.గతంలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో హోంగార్డుల నుంచి అక్రమ వసూళ్లు జరిగినట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రస్తుతం కొంతమంది హోంగార్డులను ప్రతిపక్ష నాయకులను కలిశారనే పేరుతో బెదిరించడం, వారి వివరాలు సేకరించాలని ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, ఉద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తాయని విమర్శించారు.

హోంగార్డులను వీలైనంత వరకు వారి సొంత జిల్లాల్లో లేదా కొత్త జిల్లా పరిధిలోనే విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, అన్యాయ బదిలీలను వెంటనే రద్దు చేసి హోంగార్డులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డీజీపీని కోరారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story