Sircilla: హైరిస్క్ గర్భిణులకు మెరుగైన వైద్యం అందించాలి: DMHO
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో హైరిస్క్ గర్భిణులను ముందస్తుగా గుర్తించి మెరుగైన వైద్యం అందించాలని ఏఎన్ఎంల శిక్షణలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ ఆదేశించారు.
Sircilla: హైరిస్క్ గర్భిణులకు మెరుగైన వైద్యం అందించాలి: DMHO
రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లాలో హైరిస్క్ గర్భిణులను ముందస్తుగా గుర్తించి, వారికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ సూచించారు. ప్రతి ఏఎన్ఎం హైరిస్క్ గర్భిణుల గుర్తింపు, నమోదు, ఆరోగ్య పర్యవేక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.
జిల్లాలోని ఏఎన్ఎంలకు హైరిస్క్ గర్భిణుల గుర్తింపు, నమోదు, పర్యవేక్షణ, చికిత్స, తదుపరి వైద్య సేవలపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆమె అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, రక్తహీనత, అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలతో బాధపడుతున్న వారిని ముందుగానే గుర్తించాలని సూచించారు.
హైరిస్క్ గర్భిణులను సంబంధిత వైద్యాధికారుల పర్యవేక్షణలో ఉంచి, అవసరమైన వైద్య పరీక్షలు, చికిత్సలను సకాలంలో అందేలా చూడాలని తెలిపారు. గర్భిణులందరికీ నిర్ణీత సమయంలో ఏఎన్సీ పరీక్షలు నిర్వహించడంతో పాటు ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రల వినియోగంపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, మాతా శిశు ఆరోగ్య కార్యక్రమ అధికారి డాక్టర్ నాగేందర్ బాబు ఏఎన్ఎంలకు హైరిస్క్ గర్భిణుల గుర్తింపు, ప్రమాదకర పరిస్థితుల అంచనా, రిఫరల్ విధానం, చికిత్స, నిరంతర పర్యవేక్షణపై శిక్షణ అందించారు.
జిల్లా ఎన్సీడీ కార్యక్రమ అధికారి డాక్టర్ రామకృష్ణ, జిల్లా ఇమ్యునైజేషన్ కార్యక్రమ అధికారి డాక్టర్ సంపత్, ఏఎన్ఎంలు, ఇతర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.




