Karimnagar: రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ ఉచిత వైద్యం
Karimnagar: పీఎం రాహత్ ద్వారా ₹1.50 లక్షల ఉచిత అత్యవసర వైద్యం, రాహ్‌వీర్ కింద ₹25 వేల రివార్డు మరియు నూతన చట్టాల అమలుపై సీపీ గౌష్ ఆలం సమీక్షించారు.
Karimnagar: రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ ఉచిత వైద్యం
కరీంనగర్: పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులతో పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం వీడియో కాన్ఫరెన్స్ (VC) ద్వారా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రహదారి భద్రతా పథకాలు, బాధితులకు తక్షణ సహాయం, అలాగే దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన నూతన నేర చట్టాల (New Criminal Laws) సమర్థవంతమైన అమలుపై అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
పీఎం రాహత్ మరియు రాహ్‌వీర్ పథకాలపై సమీక్ష...
సమీక్షలో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణ మరియు బాధితులకు సత్వర సహాయం అందించేందుకు ఉద్దేశించిన పథకాలపై సీపీ విస్తృతంగా చర్చించారు.
పీఎం రాహత్ స్కీమ్ (PM RAHAT Scheme) రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి గోల్డెన్ అవర్‌లో నగదు రహిత అత్యవసర చికిత్స అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. బాధితులకు ప్రమాదం జరిగిన వెంటనే 7 రోజుల పాటు లేదా గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు ఉచిత అత్యవసర వైద్యం అందుతుందని స్పష్టం చేశారు. ఈ సమాచారాన్ని స్థానిక ఆసుపత్రులు, ప్రజలకు విస్తృతంగా చేరవేయాలని సూచించారు.
రాహ్‌వీర్ స్కీమ్ (Rah-Veer Scheme - Good Samaritan) రోడ్డు ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రులకు తరలించి ప్రాణాలు కాపాడే వ్యక్తులను (గుడ్ సమారిటన్స్) ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. బాధితులను కాపాడిన వ్యక్తికి రూ. 25,000 నగదు బహుమతి లభిస్తుందని, ఒక వ్యక్తి సంవత్సరంలో గరిష్టంగా 5 సార్లు ఈ ప్రోత్సాహకానికి అర్హత పొందవచ్చని సీపీ వివరించారు. ప్రజల్లో ఈ విషయంపై అవగాహన పెంచాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు.
నూతన క్రిమినల్ చట్టాలు - సాంకేతికత వినియోగం...
అనంతరం నూతన క్రిమినల్ చట్టాల అమలు తీరుపై సమీక్ష నిర్వహించిన సీపీ, కేసుల దర్యాప్తులో పారదర్శకత మరియు వేగం పెరగాలని స్పష్టం చేశారు.
ఈ-సాక్ష్య (e-Sakshya), ఈ-సమన్స్ (e-Summons): నేర ప్రదేశాల్లో సాక్ష్యాధారాల సేకరణకు 'ఈ-సాక్ష్య' ద్వారా ఆడియో, వీడియో రికార్డింగ్‌లను తప్పనిసరిగా అమలు చేయాలని, న్యాయస్థాన సమన్ల జారీ కోసం 'ఈ-సమన్స్' విధానాన్ని పకడ్బందీగా వినియోగించాలని తెలిపారు. గడువులోగా ఛార్జ్‌షీట్ల దాఖలు, నూతన చట్టాల నిబంధనల ప్రకారం కేసు స్వభావాన్ని బట్టి 60 రోజులు లేదా 90 రోజుల నిర్దేశిత కాలపరిమితిలోనే తప్పనిసరిగా ఛార్జ్‌షీట్లు (Charge Sheets) దాఖలు చేయాలని స్పష్టం చేశారు.
పెండింగ్ కేసుల పరిష్కారం....
స్టేషన్ల వారీగా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఏసీపీలు శ్రీనివాస్, శ్రీనివాస్ జి, వెంకటస్వామి, విజయకుమార్, స్వామి, సీఐలు, ఎస్సైలు మరియు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.




