Sircilla: డ్రగ్స్ నియంత్రణకు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలి: గడ్డం నగేష్!
Sircilla: రాజన్న సిరిసిల్లలో డ్రగ్స్ నియంత్రణకు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ గురువారం నార్కోటిక్ కమిటీ భేటీలో ఆదేశించారు.
Sircilla: డ్రగ్స్ నియంత్రణకు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలి: గడ్డం నగేష్!
రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పటిష్టమైన కార్యాచరణ అమలు చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు.
గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపడుతున్న చర్యలు, భవిష్యత్తులో అమలు చేయాల్సిన కార్యాచరణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
విద్యాసంస్థలు, కళాశాలలు, యువత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో డ్రగ్స్ దుష్ప్రభావాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ సూచించారు. అనుమానాస్పద కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచాలని, ఇతర శాఖల సమన్వయంతో తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.
విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించడంతోపాటు, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ వహించేలా చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ఇప్పటికే మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వారిని గుర్తించి, వారికి అవసరమైన వైద్య చికిత్స, కౌన్సెలింగ్ అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అనుమానిత ప్రాంతాలపై నిరంతర నిఘా కొనసాగిస్తూ, మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, విక్రయాలను సమర్థవంతంగా అరికట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ హిమశ్రీ, ఎస్బీ డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీఏఓ అఫ్జల్ బేగం, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.




