Karimnagar: ఇందిరమ్మ ఇళ్ల సమీక్ష: అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు!
Karimnagar: కరీంనగర్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. మొదటి విడత పనులను త్వరితగతిన పూర్తి
Karimnagar: ఇందిరమ్మ ఇళ్ల సమీక్ష: అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు!
Karimnagar: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి, మొదటి విడతలో మంజూరైన ఇళ్ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. అర్హులైన పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
కలెక్టర్ చాంబర్‌లో గృహ నిర్మాణ శాఖ అధికారులు, ఎంపీడీవోలు, సంబంధిత అధికారులతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో గుడిసెల్లో నివసిస్తున్న 407 మందికి ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు.
వారికి వెంటనే ప్రొసీడింగ్‌లు అందించి, నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రెండో విడతలో ప్రతి నియోజకవర్గానికి 1,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్న నేపథ్యంలో అర్హులైన లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన ప్రతిపాదనలను ఇందిరమ్మ కమిటీల ద్వారా వెంటనే పంపించాలని ఎంపీడీవోలను ఆదేశించారు.
పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. అదేవిధంగా పైకప్పు మార్పిడి (రూఫ్ రీప్లేస్‌మెంట్) కోసం ప్రతి నియోజకవర్గం నుంచి 500 మంది లబ్ధిదారులను ప్రభుత్వం ఎంపిక చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
రూఫ్ రీప్లేస్‌మెంట్ కోసం ప్రభుత్వం రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించను న్నట్లు పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు.
ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి జాప్యం లేకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచి, లబ్ధిదారులకు అవసరమైన సహకారం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, గృహ నిర్మాణ శాఖ పీడీ గంగారం, ఎంపీడీవోలు, గృహ నిర్మాణ శాఖ డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.




