Sircilla: సిరిసిల్ల కాంగ్రెస్‌లో గౌడన్నలకు అన్యాయం.. పదవుల కేటాయింపుపై అసంతృప్తి

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్‌లో గౌడ సామాజిక వర్గానికి పదవుల కేటాయింపులో అన్యాయం జరుగుతోందంటూ నాయకులు పెద్దబోనాల ఎల్లమ్మ ఆలయం వద్ద సమావేశమై హెచ్చరించారు.

KALEEM, SIRICILLA
Published on: 3 Nov 2026 2:10 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్ల కాంగ్రెస్‌లో గౌడన్నలకు అన్యాయం.. పదవుల కేటాయింపుపై అసంతృప్తి

రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తున్న గౌడ సామాజిక వర్గానికి చెందిన నాయకులకు పదవుల కేటాయింపులో అన్యాయం జరుగుతోందనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. “దేవుడు వరమిచ్చినా.. పూజారి అడ్డుకుంటున్నారు” అనే సామెత సిరిసిల్ల రాజకీయాల్లో ప్రస్తుతం ప్రత్యక్షంగా కనిపిస్తోందని గౌడ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గత 10 నుంచి 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టనష్టాలు ఎదుర్కొంటూ, కేసులు, జైలు జీవితాలను సైతం లెక్కచేయకుండా పార్టీని అంటిపెట్టుకుని పనిచేస్తున్న గౌడ నాయకులకు నామినేటెడ్ పదవులు అందని ద్రాక్షగా మారాయని వాపోతున్నారు. పార్టీ కోసం సుదీర్ఘకాలంగా పనిచేసిన వారికి జిల్లా స్థాయి పదవుల్లోనూ తగిన ప్రాధాన్యత దక్కడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల సిరిసిల్లలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గౌడ సామాజిక వర్గానికి ఒక్క టికెట్ కూడా కేటాయించకపోవడం తీవ్ర బాధాకరమని గౌడ నాయకులు పేర్కొంటున్నారు. మార్కెట్ కమిటీలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) పదవుల కేటాయింపులోనూ తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికల సమయంలో మాత్రమే గౌడ సామాజిక వర్గం గుర్తుకు వస్తుందా? పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్న తమకు పదవుల కేటాయింపులో ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. త్వరలో వెలువడనున్న మార్కెట్ కమిటీలు, పీఏసీఎస్‌ల పదవుల్లోనూ డైరెక్టర్ స్థానాలు దక్కుతాయా లేదా అన్న ఆందోళన గౌడ నాయకుల్లో నెలకొంది.

ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ఉద్యమానికి సిద్ధమవుతామని గౌడ నాయకులు హెచ్చరిస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన తమకు న్యాయం చేయాలని, పదవుల కేటాయింపులో సముచిత ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో పెద్దబోనాల ఎల్లమ్మ ఆలయం వద్ద గౌడ నాయకులు సమావేశమై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. గౌడ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీలో తగిన ప్రాధాన్యత కల్పించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గంభీరావుపేట ప్రశాంత్ గౌడ్, నేరాళ్ళ శ్రీకాంత్ గౌడ్, వంగ మల్లేశం గౌడ్, బైరగోని రమేష్ గౌడ్, జాగిరి వేణు గౌడ్, గుగ్గిళ్ళ తిరుపతి గౌడ్, బెజ్జరపు అజయ్ గౌడ్, గోపాల్ గౌడ్, తిరుపతి గౌడ్, వివేక్ గౌడ్, రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

గౌడ సామాజిక వర్గానికి న్యాయం జరగాలని, గౌడన్నలను ఆ రేణుక ఎల్లమ్మ తల్లే కాపాడాలని వారు కోరుకున్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA