Sircilla: పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో యోగా డే.. అధికారులతో కలిసి యోగాసనాలు వేసిన ఎస్పీ!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా యోగా దినోత్సవం. ఎస్పీ మహేష్ బి. గితే ఆధ్వర్యంలో అధికారుల యోగాసనాలు.
Sircilla: పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో యోగా డే.. అధికారులతో కలిసి యోగాసనాలు వేసిన ఎస్పీ!
Rajanna Sircilla: జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పాల్గొని పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి యోగాసనాలు చేశారు. యోగ అనేది అంతర్గత శక్తిని మేల్కొల్పే అమూల్య సాధనమని ఎస్పీ పేర్కొన్నారు.
అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో యోగ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి యోగాసనాలు చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యోగ అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పెంపొందించే సమగ్ర జీవన విధానమని అన్నారు. భారతీయ తత్వం ప్రపంచానికి అందించిన గొప్ప సంపదల్లో యోగ ఒకటని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు యోగ ప్రాముఖ్యతను గుర్తించి ఆచరిస్తున్నారని తెలిపారు.
శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం విధులు నిర్వహించే పోలీసు అధికారులు, సిబ్బంది నిత్యం యోగ సాధన చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఒత్తిడి తగ్గించుకోవడం, ఏకాగ్రత పెంపొందించుకోవడం, ఆరోగ్యవంతమైన జీవనం గడపడం కోసం ప్రతి ఒక్కరూ యోగను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
అనంతరం యోగ గురువు మరియు వారి శిష్యులను జిల్లా ఎస్పీ అభినందించి మెమొంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు మరియు పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




