Jagtial: జగిత్యాల మెడికల్ కాలేజీలో భగ్గుమన్న వైద్య విద్యార్థుల నిరసన

Jagtial: జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో కనీస సౌకర్యాలు లేక, రేకుల షెడ్లలోనే తరగతులు నడుస్తుండటంతో విద్యార్థులు రెండో రోజూ తరగతులను బహిష్కరించి నిరసన చేపట్టారు.

ANAND, JAGITYAL
Published on: 8 Oct 2026 2:41 PM IST
Jagtial
X

Jagtial: జగిత్యాల మెడికల్ కాలేజీలో భగ్గుమన్న వైద్య విద్యార్థుల నిరసన

జగిత్యాల: జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో మౌలిక వసతుల లేమిపై వైద్య విద్యార్థుల నిరసన జ్వాలలు ఆగడం లేదు. కళాశాలలో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రెండో రోజూ తరగతులను బహిష్కరించి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.

కళాశాల ప్రారంభమై నాలుగేళ్లు గడుస్తున్నా, ఇంకా రేకుల షెడ్లలోనే తరగతులు నిర్వహించడంపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు త్వరలోనే కోర్సు పూర్తి చేసుకుని బయటకు వెళ్లనుండగా, కొత్తగా చేరే వారితో కలిపి మొత్తం విద్యార్థుల సంఖ్య 750కి చేరనుంది. అయితే, అందుకు తగ్గట్టుగా వసతులు కల్పించడంలో అధికారులు, పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు ఆరోపించారు.

తీవ్రంగా వేధిస్తున్న హాస్టల్, భోజన సమస్యలు:

కళాశాలకు చెందిన రెండు హాస్టల్ భవనాలు, రెండు కాలేజీ భవనాల నిర్మాణాలు నత్తనడకన సాగుతుండటంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వాపోయారు. వసతి గృహాలు కళాశాలకు చాలా దూరంలో ఉండటమే కాకుండా, అక్కడ కనీస సౌకర్యాలు కరువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.

సరైన హాస్టల్, డైనింగ్ హాల్ వసతి లేకపోవడంతో తరగతి గదుల్లోనే భోజనం చేయాల్సిన దుస్థితి దాపురించిందని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి, మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

ANAND, JAGITYAL

ANAND, JAGITYAL