Jagtial: రేవంత్ రెడ్డి పాలన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా ఉందన్న జీవన్ రెడ్డి!

Jagtial: కాంగ్రెస్ ప్రభుత్వం 'రేవంత్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ'గా మారింది: మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి తీవ్ర ధ్వజం. జగిత్యాల బీఆర్ఎస్ ప్రెస్ మీట్.

ANAND, JAGITYAL
Published on: 19 Aug 2026 4:21 PM IST
Jagtial
X

Jagtial: రేవంత్ రెడ్డి పాలన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా ఉందన్న జీవన్ రెడ్డి!

Jagtial: కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయినప్పటికీ, తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఒక ‘ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ’ నడుస్తోందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం 'తెలంగాణ భవన్'లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సామాజిక న్యాయం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ఛైర్మన్ గా, ఆయన అన్నదమ్ములు తిరుపతి రెడ్డి, భూపాల్ రెడ్డి, కొండల్ రెడ్డి, జగదీష్ రెడ్డి, కృష్ణ రెడ్డి డైరెక్టర్లుగా ఉంటూ హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలో భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు.

కేసీఆర్ పాలనలోనే కుల వృత్తులు, గురుకులాలకు ప్రాధాన్యం:

ఉద్యమ నాయకుడిగా పోరాడి తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసిన కేసీఆర్, దశాబ్ద కాలంలో కుల వృత్తులను ప్రోత్సహించి విద్యా అవకాశాలను పెంచారని గుర్తుచేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో 58 ఏళ్లలో కేవలం 261 గురుకులాలు ఉంటే, కేసీఆర్ హయాంలో బీసీ గురుకులాలను 19 నుండి 262కు, ఎస్సీ గురుకులాలను 134 నుండి 268కి, ఎస్టీ గురుకులాలను 96 నుండి 160కి, మైనారిటీ గురుకులాలను 12 నుండి 204కు పెంచిన ఘనత బీఆర్ఎస్‌దేనని తెలిపారు. KCR ప్రారంభించిన గురుకులాలను కనుమరుగు చేసేందుకే ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ భవనాల పేరుతో నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. రూ. 1,25,000 విలువైన గొర్రెల పంపిణీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కనుమరుగు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

బీసీ డిక్లరేషన్‌పై రాహుల్ గాంధీ స్పందించాలి:

కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో అధికారంలోకి వస్తే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు బీసీ గణనలో 5 శాతం జనాభాను తగ్గించి లెక్కలు చూపిస్తోందని విమర్శించారు. బీసీ డిక్లరేషన్ అమలుపై రాహుల్ గాంధీ ఎందుకు నోరు మెదపడంలేదని ప్రశ్నించారు. కేబినెట్‌లోని బీసీ మంత్రులు రేవంత్ రెడ్డి తల ఆడించినట్లు ఆడటానికి మాత్రమే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. మరోవైపు ఎన్డీయే పాలనలో మోదీ ప్రభుత్వం కూడా బీసీ గణన చేయడం లేదని ఆరోపించారు.

రేవంత్, పొంగులేటి ఎప్పుడైనా తెలంగాణ జెండా పట్టారా?

రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు జీవితంలో ఏనాడైనా తెలంగాణ జెండా పట్టి ఉద్యమం చేశారా అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్‌తో అడుగులో అడుగు వేసి పోరాటం చేసిన కేటీఆర్, హరీష్ రావులతో వీరికి పోలికే లేదన్నారు. "ప్రజా జీవితం అంటే ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయడం. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గుర్తుకు రావాలంటే రేవంత్ రెడ్డి తన కార్యాలయంలో కేసీఆర్ చిత్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి" అని సూచించారు. పాలనలో కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి ఆదర్శంగా తీసుకోవాలని హితవు పలికారు.

ANAND, JAGITYAL

ANAND, JAGITYAL

Next Story